రాజపక్సకు దెబ్బ మీద దెబ్బ.. పార్లమెంటూ సాగనంపింది!

కొలంబో: శ్రీలంక పార్లమెంట్ కొత్త ప్రధాని మహింద రాజపక్సకు షాకిచ్చింది. వివాదాస్పద రీతిలో ప్రధాని పదవిలో కూర్చున్న రాజపక్సను ఆ పదవి నుంచి దింపింది. ఆయనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లంక పార్లమెంట్ ఆమోదించింది. అంతకుముందున్న విక్రమసింఘెను దించి రాజపక్సను ప్రధాని చేసిన అధ్యక్షుడు సిరిసేన ఆదేశాన్ని లంక సుప్రీంకోర్టు కొట్టేసిన మరుసటి రోజే 225 మంది సభ్యులు కలగిన పార్లమెంట్ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. అయితే రాజపక్సను దించినంత మాత్రాన పాత ప్రధాని విక్రమసింఘె నేరుగా ప్రధాని అయిపోతారని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఆయన నేతృత్వంలోని పార్టీయే పార్లమెంట్‌లో అత్యధిక స్థానాలు కలిగి ఉంది.

కానీ తర్వాతి ప్రధానిని నియమించే హక్కు మాత్రం ఇప్పటికీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకే ఉంది. స్పీకర్ జయసూర్య అత్యంత గందరగోళం మధ్య బుధవారం పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహించారు. రాజపక్స వర్గం ఎంపీలు ఓటింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అధికారానికి చిహ్నమైన పార్లమెంట్‌లోని గదను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా జయసూర్య మాత్రం అలాగే ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌కు ముందే రాజపక్స, ఆయన తనయుడు నమల్ బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఈ సభకు ప్రభుత్వంపై విశ్వాసం లేదు అని ఓటింగ్ తర్వాత స్పీకర్ ప్రకటించారు. తమ డిమాండ్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్పీకర్ ఓటింగ్ నిర్వహించారని రాజపక్స ప్రభుత్వంలోని మంత్రులు ఆరోపించారు.

Related Stories: