ఓటముల ఎఫెక్ట్.. కెప్టెన్సీ నుంచి తప్పించారు!

కొలంబో: యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన శ్రీలంక లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తొలి రౌండ్‌లో బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ చేతిలో ఓటమిపాలవడంతో ఆ దేశ బోర్డుతో పాటు అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో లంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలో మాథ్యూస్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటువేసింది. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ మూడు ఫార్మాట్లకు దినేశ్ చండీమాల్‌ను సారథిగా నియమించింది. 31ఏళ్ల మాథ్యూస్‌కు గత జనవరిలో తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించారు. టీమ్ ఘోరపరాజయంపై మాథ్యూస్‌కు ఉద్వాసన పలికిన నేషనల్ సెలక్టర్లు.. త్వరలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు చండీమాల్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 10 నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో లంక తలపడనుంది. జట్టును నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో గత 18నెలలుగా శ్రీలంక జట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఉపుల్ తరంగ, లసిత్ మలింగ, చమీర కపుగెదర, తిసార పెరీరాలతో వన్డే కెప్టెన్లుగా ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టిగా విఫలమైందని.. దానికి తనను బాధ్యుడిని చేశారని ఆరోపించాడు.

Related Stories: