టిఫిన్ బాక్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన

హైదరాబాద్ : నగరంలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా నగర యువకుడు దోసపాటి రాము చేపట్టిన టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ గురించి నమస్తే తెలంగాణలో గురువారం సంచికలో ప్రచురితమైన కథనానికి విశేష స్పందన లభించింది. ఉగాది రోజున ప్రారంభించిన ఈ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తామూ చేపడతామని నగర కార్పొరేటర్లు, పౌరులు పలువరు ముందుకొచ్చారు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా, కొనుగోలుదారులే జ్యూట్ సంచులు, టిఫిన్ బాక్సులు తీసుకుపోవాలని ప్రచారం చేస్తూ, తాను ఆచరిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రాముని అభినందిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆ కథనాన్ని గురువారం పోస్ట్ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన నమస్తే కథనాన్ని షేర్ చేశారు. నగరంలోని పది కార్పొరేటర్లకు తొలిగా రాము ఈ ఛాలెంజ్‌ను విసిరితే, నమస్తే కథనంతో వేలాది మంది ఆఛాలెంజ్‌ను స్వచ్ఛందంగా స్వీకరించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని కొందరు తెలియజేయగా, మరికొందరు నగర కార్పొరేటర్లు, పౌరులు ఆయనకు పోన్ చేసి అభినందించారు. ఆ విధానాన్ని తామూ పాటిస్తామని, అదే విధంగా ప్లాస్టిక్ కవర్లు వాడే వాళ్లకు టిఫిన్‌బాక్స్, జ్యూట్ బ్యాగ్ అందించి, అవగాహన కల్పిస్తామని చెప్పినట్లు రాము నమస్తే తెలంగాణతో అన్నారు. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ కథనాన్ని సోషల్ మీడియా ద్వారా గుర్తించి స్పందించారని రాము తెలిపారు. తమ గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించేందుకు యువతకు అవగాహన కల్పించేందుకు ఈ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్‌ను నకిరేకల్‌లో కూడా చేపడతామని, అందుకు తన సహకారం కోరినట్లు రాము నమస్తే తెలంగాణతో చెప్పారు.

Related Stories: