పీడిత ప్రజల గొంతు కాళోజీ

-తెలంగాణ గడ్డమీదనే ప్రశ్నించేతత్వం -ఆ తత్వంతోనే ప్రత్యేక రాష్ట్ర సాధన -కేసీఆర్ వల్లే భావితరాలకు మహనీయుల చరిత్ర -కాళోజీ జయంతి సభలో స్పీకర్ మధుసూదనాచారి -కాళోజీ.. ఒక కవితా ప్రభంజనం -ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని -ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం -ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పుటుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. అంటూ అందరిలో దేశభక్తి నింపిన కలం ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చెప్పారు. ఆయన రాసిన ప్రతి అక్షరం.. సామాన్యుడి నుంచి పండితుల వరకు ఆలోచింపజేసే కవితాఝరి అన్నారు. అభ్యుదయ కవి కాళోజీ చిరస్మరణీయుడని నివాళులర్పించారు. కాళోజీ నారాయణరావు 104వ జయంతి, ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలంగాణ భాషా దినోత్సవం ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. కాళోజీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీదనే ప్రశ్నించేతత్వం ఉందని చెప్పారు.

తెలంగాణలో కవులు, ప్రజల ప్రశ్నించేతత్వానికి కాళోజీ ప్రతిబింబం అని అభివర్ణించారు. ఆ తత్వంతోనే ప్రత్యేకరాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించుకోగలిగామని అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని అందరూ ప్రశ్నించారని గుర్తుచేసిన స్పీకర్.. ఉమ్మడి పాలనలో అణచివేతకు గురైన అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకరాష్ట్రం వచ్చాక చైతన్యవంతంగా ప్రగతి సాధిస్తున్నారని, తెలంగాణ గడ్డమీద పుట్టిన మహనీయులను స్మరించుకోగలుగుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే కాళోజీ లాంటి మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించగలుగుతున్నామన్నారు. పేదలకు ఎక్కడ అన్యాయ ం జరిగినా పీడితుల పక్షాన కాళోజీ తన గొంతుకను వినిపించారని, తన అక్షరాలతో ప్రజలను చైతన్యం చేశారని మధుసూదనాచారి గుర్తుచేసుకున్నారు. ఆయన తిరుగాడిన వరంగల్ నేల మీద పుట్టడం తమ అదృష్టమన్నారు.

స్ఫూర్తిదాయకం కాళోజీ జీవితం: మహమూద్ అలీ

ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో మహనీయులను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. కాళోజీ వంటి మహనీయులు తెలంగాణ గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను స్థాపించిన సందర్భంలో, తెలంగాణ మలిదశ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న సమయంలో కాళోజీ సలహాలను తీసుకొని సీఎం కేసీఆర్ విజయాన్ని సాధించారని చెప్పారు. ప్రభుత్వం తెలుగు భాషను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని తెలిపారు. భాషా పరిరక్షణ ద్వారానే మన సంస్కృతి నిలబడుతుందని ఆయన అన్నారు. కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం మనందరి అదృష్టమన్నారు. తెలంగాణ వచ్చాక ఈ గడ్డమీద పుట్టిన కవులు, కళాకారులు, కాళోజీ వంటి సామాజిక ఉద్యమకారులకు ప్రాధాన్యం దక్కిందని చెప్పారు. కాళోజీ జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పేదల గొంతుకను వినిపించే కవిగా, ప్రజాప్రతినిధిగా, ఉద్యమకారుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని నాయిని చెప్పారు.

అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసే కాళోజీ పురస్కారాన్ని ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్‌కు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో నవీన్‌కు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సాహితీ చైతన్యమూర్తి కాళోజీ సాహితీ పురస్కారాన్ని తనకు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కాళోజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి వేడుక నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు సాంస్కృతిక సారథి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.