విధి నిర్వహణలో పాముకాటుకు బలైన పోలీస్ కుక్క

విధి నిర్వహణలో ఎంతోమంది జవాన్లు, పోలీసులు తమ ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉంటాం. అలాగే ఓ పోలీస్ కుక్క కూడా తన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. సౌత్ కొరియాకు చెందిన పోలీస్ కుక్క పాము కాటుతో మరణించింది. జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ కుక్క వయసు 7 ఏండ్లు. 2012 నుంచి ఇది పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తుంది. ఇప్పటి వరకు 39 మంది నేరస్థులను పట్టించిన ఈ శునకం కనిపించకుండా పోయిన 170 మందికి పైగా ఆచూకీని తెలిపిందట. గత సంవత్సరం ఓ మహిళ మర్డర్ మిస్టరీని ఛేదించడంలోనూ ఈ కుక్క ప్రముఖ పాత్ర పోషించిందట. ఇంతటి విజయ చరిత్ర ఉన్న లారీ అనే ఈ కుక్క నార్త్ చంగ్‌చియోంగ్ ప్రావిన్స్‌లో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతుకుతూ పాముకాటుకు గురయి మరణించిందట. ఎన్నో కేసులను ఛేదించడానికి పోలీసులకు సహాయపడిన లారీకి నివాళులు అర్పించిన పోలీసులు.. దానికి గుర్తుగా సంస్మరణ సభను ఏర్పాటు చేసి దాన్ని గౌరవించాలనుకున్నారట. అందుకే వచ్చే నెల సౌత్ కొరియాలో జరగనున్న డాగ్ ఫెస్టివల్‌లో దానికి కాంస్య పతకాన్ని అంకితం చేయనున్నారట. అయితే.. ప్రతి సంవత్సరం సౌత్ కొరియాలో జరిగే డాగ్ ఫెస్టివల్‌లో కుక్క మాంసాన్ని ఉడికించి కూరగా వండి సౌత్ కొరియన్లు తింటారు. దాదాపు 10 లక్షల కుక్కలను ఈ ఫెస్టివల్‌లో భాగంగా వాళ్లు ఆరగిస్తారు.

Related Stories: