సయ్యద్ మోడీ టోర్నీకి సింధు దూరం

న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు.. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి తప్పుకున్నది. వచ్చే నెలలో చైనాలో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌పై దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అనుమతి కోసం బాయ్‌కు లేఖ రాసిందని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. నిర్వాహకులతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్‌కు కూడా ఈ విషయాన్ని తెలిపిందన్నారు. డిసెంబర్ 12 నుంచి 16 వరకు జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు గ్వాంగ్జ్ తొలిసారి ఆతిథ్యమిస్తున్నది. ఈ సీజన్ సూపర్ ఫామ్‌లో ఉన్న తెలుగమ్మాయి.. కామన్వెల్త్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో రజత పతకాలతో సత్తా చాటింది. ఇండియా, థాయ్‌లాండ్ ఓపెన్‌లలో ఫైనల్‌కు, ఆల్‌ఇంగ్లండ్‌లో సెమీస్‌కు వచ్చింది.