హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది

సిల్లీఫెలోస్ సినిమా తమ బ్యానర్ ప్రతిష్టను పెంచుతుందనే నమ్మకముందని అన్నారు కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి. బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా పతాకంపై వారు నిర్మించిన చిత్రం సిల్లీఫెలోస్. అల్లరినరేష్, సునీల్, చిత్రాశుక్లా, నందినిరాయ్ కీలక పాత్రలను పోషించారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. ఈ నెల 7న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు.

కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. లాజిక్‌లతో సంబంధం లేకుండా ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. అనవసరపు పంచ్‌లు, ప్రాసలు సినిమాలో కనిపించవు. కథానుగుణంగానే కామెడీ ఉంటుంది. తమిళ చిత్రం వేలయిన్ వందుత్తా వళ్లైకారన్ కథను తెలుగు నేటివిటీకీ అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందించాం. సంభాషణలు, సన్నివేశాలన్నీ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా ఉంటాయి. ఏ క్లాస్ నుంచి సీ క్లాస్ వరకు అందరిని అలరిస్తుంది.

కథలో పాలుపంచుకున్నారు..

తొలుత నరేష్ హీరోగా సినిమా మొదలుపెట్టాం. కథలోని కీలక పాత్రకోసం సునీల్ అయితే బాగుంటుందని అనిపించింది. కానీ ఆయన హీరోగా సినిమాలు చేస్తుండటంతో సహాయక పాత్రలో నటిస్తారో లేదో అనే అనుమానంతోనే ఆయన్ని సంప్రదించాం. పాత్రకున్న ప్రాధాన్యత నచ్చి సునీల్ నటించడానికి అంగీకరించడం సినిమాకు ప్లస్ అయ్యింది. సునీల్, నరేష్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. ఇద్దరూ బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. స్కిప్ట్ వర్క్‌లో వారు పాలుపంచుకున్నారు.దర్శకుడు భీమినేని శ్రీనివాస్ కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలుస్తుంది.

కథను నమ్మి..

నేనే రాజు నేనే మంత్రి, ఎమ్‌ఎల్‌ఏ తర్వాత మా బ్యానర్‌లో హ్యాట్రిక్ సక్సెస్‌గా తప్పకుండా నిలుస్తుంది. హీరోల జయాపజయాలతో సంబంధం లేకుండా హిట్ అవుతుందనే నమ్మకంతోనే రూపొందించాం. మంచి సినిమా చూశామనే తృప్తిని ప్రేక్షకులకు మిగుల్చుతుంది. కథ కుదిరితే నేనే రాజు నేను మంత్రి సినిమాకు సీక్వెల్ చేస్తాం. తదుపరి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాం.