దిశను నిర్దేశించనున్న

ఐఐపీ, ద్రవ్యోల్బణం ఆరువారాల వరుస పెరుగుదల తర్వాత గత వారం దేశీయ మార్కెట్ నికరంగా నష్టంతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు అరశాతం పైగా నికరంగా నష్టపోయాయి. మొదటి మూడురోజులు భారీగా నష్టపోయిన మార్కెట్ చివరి రెండు రోజుల్లో లాభాలతో ముగిసింది. పతనం అవుతున్న రూపాయి మారకం విలువ, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ట్రేడ్ వార్ భయాలు మార్కెట్‌ను గత వారం ప్రభావితం చేశాయి. ప్రోత్సాహకరంగా వచ్చిన జీడీపీ డేటా కూడా మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపించలేకపోయింది. గతవారం పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ గరిష్ఠంగా 5.4 శాతం మేర నష్టపోయింది. ఎఫ్‌ఎంసీజీ, మీడియా ఇండెక్స్ సగటున 4.5 శాతం మేర నష్టపోయాయి. ఫార్మా ఇండెక్స్ 2.6 శాతం, ఐటీ ఇండెక్స్ 1.9 శాతం, మెటల్ ఇండెక్స్ 1.6 శాతం చొప్పున లాభపడ్డాయి. రూపాయి మారకం విలువ వరుసగా రెండో వారం కూడా పతనం అయి జీవన కాల కనీస స్థాయి రూ.72.10కి పతనం అయింది. ఆసియా కరెన్సీలన్నింటిలోకి రూపాయి విలువనే అధికంగా నష్టపోయింది. డేటా కీలకం వచ్చే వారం కేవలం నాలుగే ట్రేడింగ్ సెషన్లు ఉన్నాయి. బుధవారం వెలువడనున్న ఐఐపీ, ద్రవ్యోల్బణం డేటాలు కీలకం కానున్నాయి. వినాయకచవితి సందర్భంగా గురువారం నాడు మార్కెట్లకు సెలవు. ఐఐపీ కన్నా ద్రవ్యోల్బణం డేటాను మార్కెట్ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి వెలువడితే రిజర్వ్‌బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇది మార్కెట్‌కు ప్రతికూలంగా మారే అంశం. అలాగే క్రూడాయిల్ ధరలు, డాలర్ రూపాయి మారకం విలువ ట్రెండ్ కూడా మార్కెట్‌కు కీలకమే. మరో వైపు అన్ని చైనా ఉత్పత్తులపై అదనపు వాణిజ్య సుంకాలను విధించడానికి ట్రంప్ సిద్ధ పడుతున్నారన్న వార్తలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావాన్ని చూపించనున్నాయి. వీటికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల తీరు కూడా ముఖ్యమే. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు నికరంగా అమ్మకాలే జరిపిన ఎఫ్‌ఐఐలు వచ్చే అమ్మకాల జోరును పెంచితే మార్కెట్ పెరగడానికి అవకాశాలు తగ్గిపోతాయి. టెక్నికల్స్: బేరిష్ ఎంగల్ఫింగ్ నిఫ్టీ వీక్లీ చార్ట్‌లో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాట్రన్ ఏర్పడింది. దీనికి తోడు గత వారం ఏర్పడిన షూటింగ్ స్టార్ లాంటి బేరిష్ ప్యాట్రన్‌కు ఈవారం భారీ నెగటివ్ హ్యాంగింగ్ మ్యాన్ లాంటి క్యాండిల్‌తో ధృవీకరణ లభించింది. గరిష్ఠ స్థాయిల్లో మారెట్ గత రెండు మూడు వారాలు మూమెంటమ్ తగ్గుతూ వస్తున్నది. డైలీ చార్ట్‌లో వరుసగా మూడురోజుల పాటు హ్యామర్ ప్యాట్రన్లు ఏర్పడి 11,400 స్థాయిలో మద్దతు ఏర్పాటు చేసింది. ద్రవ్యోల్బణం డేటా వెలువడే వరకూ మార్కెట్లు మరో రెండు రోజుల పాటు స్థిరీకరణకే ప్రాధాన్యత ఉంటుంది. ఇండికేటర్లు ప్రస్తుతానికి న్యూట్రల్ జోన్‌కు చేరుకున్నాయి. మళ్లీ 11700 స్థాయిలోని నిరోధాన్ని అధిగమిస్తే మార్కెట్ బుల్లిష్‌గా మారుతుంది.

Related Stories: