మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చిన క్రికెటర్: వీడియో వైరల్

అబుదాబి: ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాక్‌ 3 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ వీరోచిత పోరాటంతో పాక్ విజయాన్నందుకుంది. మ్యాచ్‌లో అఫ్గాన్ ఓటమిపాలవడంతో ఆ దేశ క్రికెటర్ మైదానంలో బోరున విలపించాడు. జట్టు ఓటమికి తానే కారణమని భావించిన అతడు మోకాళ్లపై కూర్చొని, తన జెర్సీని ముఖానికి అడ్డు పెట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. పాక్ విజయానికి ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. అఫ్గాన్ బౌలర్ అఫ్తాబ్ ఆలమ్ చివరి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్నాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన షోయబ్‌ మాలిక్‌ (51 నాటౌట్‌; 43 బంతుల్లో 3×4, 1×6) ఒక సిక్స్, ఫోర్ బాది.. మూడు బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. దీంతో అఫ్గాన్ ఓటమిని అఫ్తాబ్ తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తరువాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం సాధారణమే. ఈ క్రమంలో ఆఫ్తాబ్ ఏడుస్తుండటంతో మాలిక్ అతడిని ఓదార్చాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన మాలిక్‌పై ప్రస్తుతం సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాక్ జట్టుకు గట్టిపోటీనిచ్చిన ఆఫ్గాన్ చివరి వరకు విజయం కోసం పోరాడింది.

Related Stories: