నాన్న వారసత్వాన్ని చైతూ తీసుకున్నాడు

అందరూ చైతూని శైలజారెడ్డి అల్లుడు అంటున్నారు. కానీ చైతన్య... అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు. నాగార్జున పెద్దకొడుకు. నాన్నగారు ప్రేమకథా చిత్రాలు, మహిళా ప్రధాన ఇతివృత్తాలు చాలా చేశారు. ఆ జోనర్‌లలో ఆయనకు ఆయనే సాటి. నాన్న వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు అని అన్నారు కథానాయకుడు నాగార్జున. నాగచైతన్య, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 13న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్యను అందరూ సాఫ్ట్, బంగారం అని పిలుస్తుంటారు.

కానీ..చైతూలో అందరికి తెలియని చిలిపితనం ఉంది. దర్శకుడు మారుతి ఆ చిలిపితనాన్ని బాగా వాడుకున్నారు. రమ్యకృష్ణతో నేను చాలా సినిమాలు చేశాను. అందులో ఎన్నో మంచి విజయాలున్నాయి. మేమిద్దరం కలిసి నటించిన అల్లరి అల్లుడు తరహాలో ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలవాలి. మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా అభిమానులకు ఏం కావాలో ఆయన ఇచ్చారని అనుకుంటున్నాను. గత నెల కలిసిరాలేదు. నాకు ఆప్తుడైన హరికృష్ణ అన్నయ్య అందరిని వదిలివెళ్లిపోయారు. పరిశ్రమలో నేను అన్నయ్య అని పిలిచేది ఆయన ఒక్కరినే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. ఇక రవీందర్‌రెడ్డి.. నాన్నగారి దగ్గరి నుంచి మా అక్కినేని కుటుంబంతో ఉన్నారు. ఎలాంటి వేడుక అయినా తన భుజాన వేసుకొని నడిపించేవారు. వారు దూరమవ్వడం బాధను కలిగించింది అని తెలిపారు.

నాని మాట్లాడుతూ దేవదాస్ సినిమాకు సంబంధించి నాగార్జునతో నా షూటింగ్ మొత్తం అయిపోయింది. మళ్లీ ఆయణ్ణి ఎప్పుడు కలుస్తానో తెలియదు. ఆయన్ని కలవడానికే ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీలో నాగచైతన్య నాకు ఒక సంవత్సరం జూనియర్. మా ముందు తరంలో ప్రజాదరణ పొందిన గీతాలన్ని నాగార్జున దక్కేవి. ఇప్పుడు మా తరానికి వచ్చేసరికి బెస్ట్ సాంగ్స్ అన్నీ చైతన్యకు పడుతున్నాయి. ట్రైలర్ బాగుంది. అల్లరి అల్లుడు లాంటి సినిమా ఇదని నాగార్జున ఈ సినిమా గురించి నాతో చెప్పారు. ఆ మాటలతోనే సినిమా ఎంత సరదాగా ఉంటుందో తెలిసిపోయింది. పెద్ద బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలవాలి అని తెలిపారు. అఖిల్ మాట్లాడుతూ సరైన టైమ్‌లో కరెక్ట్ హీరోను పట్టుకున్నారు దర్శకుడు మారుతి. పెళ్లి తర్వాత అన్నయ్య ముఖంలో కళ కనిపిస్తున్నది . ట్రైలర్స్ చూస్తుంటే భలే ఉన్నాడనిపిస్తుంది. సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.

అభిమానులు గర్వపడే సినిమాలే చేస్తా -నాగచైతన్య

నాగచైతన్య మాట్లాడుతూ అభిమానులే నా బలం, బలహీనత. వారిని నేనో కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. అభిమానులు నా గురించి చేసే ప్రతి కామెంట్‌ను చదివి తప్పొప్పుల్ని సరిచేసుకుంటాను. భవిష్యత్తులో మీరంతా గర్వపడే సినిమాలే చేస్తాను. అభిమానులు కోరుకునే ఓ మంచి సినిమాను దర్శకుడు మారుతి ఇచ్చారు. సినిమాలో నన్ను కొత్త పంథాలో చూపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రెండేళ్ల క్రితం నాకు ప్రేమమ్‌రూపంలో మధురమైనవిజయాన్ని ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు మరో మంచి సినిమాను అందించారు. భవిష్యత్తులో వారితో మరిన్ని సినిమాలు చేయాలనుంది. పండుగలాంటి సినిమా ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి ముఖంలో నవ్వును చూస్తూ నేను పండుగ చేసుకుంటాను అని తెలిపారు.

నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ఇదని, ఇలాంటి పాత్రను ఇప్పటివరకు చేయలేదని అను ఇమ్మాన్యుయెల్ చెప్పింది. రమ్యకృష్ణ మాట్లాడుతూ మంచి వినోదాన్ని పంచే చిత్రమిది. చిలిపితనం కలిగిన యువకుడిగా నాగచైతన్య పాత్ర కొత్తగా కనిపిస్తారు. ఇన్నేళ్ల కెరీర్‌లో వేగంగా చేసిన తొలి సినిమా ఇది అని తెలిపింది. మారుతి మాట్లాడుతూ అభిమానులు కోరుకుంటున్నట్లుగానే నాగచైతన్య ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాతో యువసామ్రాట్ స్థిరపడిపోతారు. 1980, 90 కాలం నాటి కథల మాదిరిగా అత్తా అల్లుళ్ల పోరు, ఛాలెంజ్‌లు ఈ సినిమాలో ఉండవు. స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. ఓ సాధారణ యువకుడు శైలజారెడ్డి అల్లుడు ఎలా అయ్యాడన్నదే ఈ చిత్ర కథ. రమ్యకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమెతో పనిచేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. ఈ సినిమాతో నాగచైతన్య రూపంలో కష్టసుఖాల్ని పంచుకునే మంచి స్నేహితుడు దొరికాడు అని చెప్పారు.