రాష్ర్టానికి అవార్డుల పంట

-గ్రామీణాభివృద్ధిలో ఏడు జాతీయ అవార్డులు -ఢిల్లీలో స్వీకరించిన రాష్ట్ర అధికారులు -అభినందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖకు అవార్డుల పంట పండింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వివిధ విభాగాల్లో ఏటా ఇచ్చే అవార్డులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ గెలుచుకున్నది. ఒకే ఏడాది ఏడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుని రికార్డు నెలకొల్పింది. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూప్రసాద్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఈ అవార్డులను అందుకున్నది. ఈ సందర్భంగా రాష్ర్టానికి జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ అభినందించారు. -పారదర్శకత, జవాబుదారీతనం క్యాటగిరీ కింద తెలంగాణ రాష్ర్టానికి ప్రథమస్థానం లభించింది. ఈ అవార్డును కమిషనర్ నీతూప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ బీ సైదులు స్వీకరించారు. -ఉపాధి పథకం, సుపరిపాలన కార్యక్రమాల విభాగంలో రాష్ర్టానికి ద్వితీయస్థానం లభించగా, ఈ అ వార్డును పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ సైదులు అందుకున్నారు.
-శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో అత్యుత్తమ పురస్కారం కింద రెండురాష్ర్టాలకు అవార్డులు ప్రకటించారు. అందులో తెలంగాణ ఒకటి. ఈ అవార్డును పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, ఐఎఫ్‌ఎస్ ఎస్‌జే ఆశ స్వీకరించారు. -ఉపాధిహామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలను ఎంపికచేయగా అందులో సిద్దిపేట జిల్లా ఇబ్రంహీంపూర్ పంచాయతీ ఒకటి. అవార్డును ఇబ్రంహీంపూర్ పంచాయతీ క్షేత్రసహాయకుడు రాజు, పంచాయతీ కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎంపీడీవో సమ్మిరెడ్డి అందుకున్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో.. నిక్కచ్చిగా చెల్లించిన విభాగంలోనూ 18 అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణకు సంబంధించి ఈ అవార్డును మెదక్ జిల్లా శంకరంపేట మండలం మక్తలకా్ష్మపూర్‌కు చెందిన బీపీఎం శాప మానయ్య అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఉపాధి స్టేట్ ప్రోగ్రాం మేనేజర్లు దుర్గాప్రసాద్, శేషుకుమార్, మరళీధర్, లెంకలపల్లి కృష్ణమూర్తి, అధికారులు నర్సింగరావు, శేఖర్, నర్సింహులు పాల్గొన్నారు.