చందా కొచ్చర్‌కు త్వరలో సమన్లు!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్‌కు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణంతో తన భర్తయైన దీపక్ కొచ్చర్ ఆర్థికంగా లాభపడ్డారని ఆరోపణలు వెళ్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్, కొచ్చర్ కుటుంబానికి ఉన్న వ్యాపార సంబంధాలపై ఇప్పటికే పలు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని, వీటిపై వచ్చేవారంలో జరుగనున్న సెబీ బోర్డు సమావేశంలో చర్చించి, చివరకు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసును అటు రిజర్వుబ్యాంక్‌గానీ, ఇటు కేంద్ర ప్రభుత్వంగానీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ ఆరోపణలపై బ్యాంక్, కొచ్చర్‌గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, మార్గదర్శకాలకు లోబడి జారీ చేసినట్లు, దీపక్ కొచ్చర్‌కు ఉన్న వ్యాపార సంబంధాలపై తనకు తెలియదని చందా కొచ్చర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సెబీ బోర్డులో ఆర్థిక, కార్పొరేట్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతోపాటు ఆర్బీఐ, ఇండిపెండెంట్ సభ్యులు ఉండటంతో వచ్చే వారం జరుగనున్న సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నది.ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంకుకు, చందా కొచ్చర్‌కు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Related Stories: