ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 5,649 కోట్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 : గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.5,649 కోట్ల విలువైన పెట్టుబడులను విరమించుకున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం, క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతుండడంతో ఎఫ్‌పీఐలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో ఈక్విటీ, రుణ మార్కెట్ల నుంచి మొత్తం రూ. 5,649 కోట్లను విరమించుకున్నారు. ఆగస్టు నెలలో నికరంగా రూ. 2,300 కోట్లను మదుపు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో మొత్తం రూ. 61,000 కోట్ల పెట్టుబడులను మార్కెట్ నుంచి విరమించుకున్నారని డిపాజిటరీ డాటా వెల్లడించింది. సెప్టెంబర్ 3-7 తేదీల మధ్య రూ. 1,021 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి విరమించుకోగా, రుణ మార్కెట్ల నుంచి రూ, 4,628 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం రూ. 5,649 కోట్లను దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విరమించుకున్నట్టయింది. ఎఫ్‌పీఐల పెట్టుబడులపై సెబీ సర్క్యులర్ కూడా అమ్మకాలకు కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కేవైసీ నిబంధనలను అమలు చేస్తే దేశం నుంచి 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలివెళతాయని అసెట్ మేనేజర్స్ రౌండ్‌టేబుల్ ఆఫ్ ఇండియా (ఏఎంఆర్‌ఐ) తెలిపింది. సెబీ సర్క్యులర్‌తో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్నింగ్‌స్టార్ సీనియర్ అనలిస్టు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుంచి నికరంగా రూ, 3,400 కోట్లు, రుణ మార్కెట్ల నుంచి 42,600 కోట్లను విరమించుకున్నారు.