గుడ్‌న్యూస్.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సోమవారం నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. జనరల్, సీనియర్ సిటిజన్స్ కేటగిరీలు రెండింట్లోనూ వివిధ మొత్తాలు, డిపాజిట్ కాల వ్యవధులను బట్టి వడ్డీ రేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లు ఏడాది నుంచి పదేళ్ల కాల వ్యవధిలో ఉన్న వాటికి 5 నుంచి పది బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే 0.05 శాతం నుంచి 0.1 శాతం వరకు వడ్డీ రేట్లు పెరిగాయి. ఏడాదిలోపు డిపాజిట్లపై గతంలో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి. ఏడాది నుంచి రెండేళ్ల వరకు గతంలో ఉన్న 6.65 శాతం వడ్డీ రేటు ఇక నుంచి 6.7 శాతంగా.. 2 నుంచి 3 ఏళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 6.75 శాతంగా ఉండనుంది. ఇక మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై గతంలో 6.7 శాతంగా ఉన్న వడ్డీ రేటు.. 6.8 శాతానికి చేరింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య డిపాజిట్లకు 6.75 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఇక 6.85 శాతంగా ఉండనుంది.

సీనియర్ సిటిజన్ల డిపాజిట్‌లపై ఉన్న వడ్డీ రేట్లు కూడా ఎస్‌బీఐ పెంచింది. కోటి లోపు వివిధ కాల వ్యవధుల్లో ఉన్న డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెరిగాయి. ఏడాది నుంచి రెండేళ్ల వరకు 7.15 శాతంగా ఉన్న వడ్డీ రేటు 7.2 శాతానికి.. రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లకు 7.25 శాతానికి పెరిగింది. ఇక మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఉన్న డిపాజిట్లకు గతంలో 7.2 శాతం వడ్డీ రేటు ఉండగా.. అది 7.3 శాతానికి చేరింది. ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు డిపాజిట్లకు గతంలో ఉన్న 7.25 శాతం వడ్డీ రేటు ఇప్పుడు 7.35 శాతానికి చేరింది. ఇక ఎస్‌బీఐ స్టాఫ్, పెన్షనర్లకు ఇచ్చే వడ్డీ రేటు పైన ఉన్న వాటి కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ స్పష్టంచేసింది. ఎస్‌బీఐ బాటలోనే త్వరలో మిగతా బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. బుధవారం ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం నేపథ్యంలో ఎస్‌బీఐ తన డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది.

Related Stories: