ఇప్పట్లో విలీనాలకు వెళ్లం

ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఇతర బ్యాంకులను విలీనం చేసుకునే పరిస్థితిలో ప్రస్తుతం ఎస్‌బీఐ లేదని బ్యాంక్ చైర్మన్ రజ్నీశ్ కుమార్ స్పష్టం చేశారు. గతేడాది 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో రెండు, మూడేండ్లు ఆ ప్రభావం బ్యాంక్ లాభాలపై ఉండొచ్చన్నారు. ఈ క్రమంలోనే మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకునే స్థితిలో ఎస్‌బీఐ లేదన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ మెరుగైన నిర్వహణ కోసం బ్యాంకుల ఏకీకరణ అవసరమేనన్న ఆయన ఎస్‌బీఐలో మాత్రం ఇప్పట్లో విలీనాలుండవని చెప్పారు. కాగా, విద్యుదుత్పాదక రంగంలో దాదాపు రూ.17,000 కోట్ల విలువైన 7-8 మొండి బకాయిలకు సంబంధించి నవంబర్‌లోగా ఓ పరిష్కారం లభించగలదన్న ఆశాభావాన్ని రజ్నీశ్ వ్యక్తం చేశారు. ఇదిలావుంటే దేశ జీడీపీలో గృహస్తుల రుణాలు 10 శాతం దిగువనే ఉన్నా.. అదంతగా ప్రమాదకరం కాదని ఎస్‌బీఐ రిసెర్చ్ ఓ నివేదికలో అభిప్రాయపడింది.

Related Stories: