నేను షర్ట్ విప్పుతా.. నువ్వు కూడా విప్పు!

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. చారిత్రక లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ చేసుకున్న సంబురాలను ఎవరూ అంత తొందరగా మరచిపోరు. ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించి నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భంగా దాదా అలా చేశాడు. ఆ వీడియోను ఆ తర్వాత ఎన్నో న్యూస్ చానెల్స్ ఎన్నో వందలసార్లు చూపించాయి. అయితే అప్పుడు దాదా అలా సంబురాలు చేసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ వద్దని వారించాడట. గంగూలీ షర్ట్ విప్పబోతుంటే.. అలా చేయకు అని లక్ష్మణ్ చెప్పాడట. ఈ విషయాన్ని గంగూలీయే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే దాదా మాత్రం వినలేదు.

అంతేకాదు నువ్వు కూడా షర్ట్ విప్పు అని తాను లక్ష్మణ్‌తో అన్నట్లు గంగూలీ చెప్పాడు. లార్డ్స్ బాల్కనీలో నేను రైట్‌సైడ్ నిల్చున్నాను. నా పక్కనే లక్ష్మణ్, వెనుకాల భజ్జీ ఉన్నాడు. మ్యాచ్ ముగియగానే నేను షర్ట్ విప్పబోతుంటే.. లక్ష్మణ్ ఆపడానికి ప్రయత్నించాడు. వద్దు.. అలా చేయొద్దు అని వారించాడు. నేను షర్ట్ విప్పిన తర్వాత మరి నేనేం చేయాలని అని లక్ష్మణ్ అడిగాడు.. నువ్వు కూడా నీ షర్ట్ విప్పేసెయ్ అన్నాను అని గంగూలీ ఆ రోజు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా దాదా ఈ ఆసక్తికర ఘటనపై స్పందించాడు. అంతకుముందే ఇండియాలో సిరీస్‌ను 3-3తో డ్రాగా ముగించిన తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ ఇలాగే షర్ట్ విప్పి సంబురాలు చేసుకున్నాడు.

అది గుర్తొచ్చి అప్పటికప్పుడు తాను కూడా అలా చేసినట్లు గంగూలీ చెప్పాడు. నిజానికి తాను ఆ పని చేసినందుకు బాధపడినట్లు కూడా అతను తెలిపాడు. ఆ రోజు అలా చేసిన తర్వాత నా కూతురు నన్ను నిలదీసింది. అలా చేయడం అవసరమా అని ప్రశ్నించింది. అప్పుడేదో పొరపాటు జరిగిపోయింది అని చెప్పాను. జీవితంలో మన నియంత్రణ లేకుండా ఇలా కొన్ని ఘటనలు జరిగిపోతాయి అని కోల్‌కతా ప్రిన్స్ అన్నాడు.

× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..