ప్రధాని మోదీపై పక్షి కూడా వాలలేదు

బీజేపీపై మిత్రపక్షమైన శివసేన మరోసారి గర్జించింది. ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర జరిగిందన్న వాదనను కొట్టిపారేసింది. రాజీవ్‌గాంధీ హత్యాయత్నానికి కుట్రను పన్నుతున్నారంటూ ఐదుగురు అర్బన్ నక్సల్స్‌ను అరెస్టు చేయడంపై పుణే పోలీసులపై మండిపడింది. ఇందిర, రాజీవ్ వంటి మాజీ ప్రధానులు ధీరులని, సాహసించి ప్రాణాలు బలిపెట్టారని, కానీ మోదీ అలాంటి సాహసాలకు ఒడిగట్టరని ఎద్దేవా చేసింది. ఈ సరికే ఆయనకు ఉత్తమమైన భద్రత ఉన్నదని, ఆయనపై పక్షి కూడా వాలలేదని తెలిపింది. పోలీసుల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని తూర్పారబట్టింది. ఇదివరకటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదింపారని, మావోయిస్టులు కాదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని మార్చేందుకు అవకాశముందని పేర్కొన్నది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయాలు రాసింది. పుణే పోలీసులు నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. ప్రభుత్వం వారిని అలా మాట్లాడకుండా నిలువరించాలి. ఇది పూర్తిగా పిచ్చిపని అని సామ్నా ఎండగట్టింది. ప్రభుత్వం పోలీసులను వివిధరకాల పనులకు ఉపయోగించడం కొత్తేమీ కాదని తెలిపింది. ప్రస్తుత కేసులో ఎంత తొందరగా వాస్తవాలు వెలుగు చూస్తే అంతమంచిది.. పోలీసుల ముసుగు తొలగిపోతుందని సామ్నా అభిప్రాయపడింది.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?