మేడారం 'మహా జాతర'తేదీలు ఖరారు

తాడ్వాయి: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర తేదీలను ఆదివారం పూజారులు ఖరారు చేశారు. ఈ మేరకు మేడారంలోని వనదేవతల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల మహాజాతర జరిగే తేదీలపై పూజారులు చర్చించారు. అనంతరం 2020 ఫిబ్రవరి మాసంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని 5వ తేదీ నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు అమ్మవార్ల మహాజాతరను నిర్వహించాలని నిర్ణయించారు. 5న సారక్క దేవత, గోవిందరాజు, పగిడ్దిరాజు గద్దెలపైకి చేరడం, 6న సమ్మక్క దేవత చిలకలగుట్ట నుంచి గద్దెపై కొలువుదీరడం, 7న అమ్మవార్ల గద్దెలకు భక్తుల మొక్కులు, 8న దేవతల వనప్రవేశం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు పూజారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పూజారులు సిద్దబోయిన మునీనిందర్, మహేష్, లక్ష్మణ్‌రావు, కొక్కెర క్రిష్ణయ్య, చందా బాబురావు, కాక సారయ్య, కిరణ్‌కుమార్, కనకమ్మ, లక్ష్మింబాయమ్మ, భుజంగరావు, కాక వెంకటేశ్వర్లుతో పాటు పూజారులు కుటుంబాల సభ్యులు గోపాల్‌రావు, బోజారావు, అనిల్, స్వామి, వసంతరావు, సురేందర్ తదితరులున్నారు.
More in తాజా వార్తలు :