ఫైనల్లో సమీర్‌వర్మ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో సమీర్‌వర్మ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సమీర్ 16-21, 21-15, 21-11 తేడాతో గురుసాయిదత్‌పై గెలిచాడు. 51 నిమిషాల పాటు జరిగిన సెమీస్ పోరులో మెరుపు స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్, డ్రాప్‌షాట్లతో జోరు కనబరిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సూంగ్ జువెన్(మలేషియా)తో సమీర్ తలపడుతాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో లోకల్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి 21-14, 21-16తో అరుణ్ జార్జ్, సన్యన్ శుక్లాపై విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ పోరులో ప్రణవ్ జెర్రీచోప్రా, సిక్కీరెడ్డి 21-19, 21-15తో ఐదో సీడ్ హాంకాంగ్ జో చాంగ్ టక్ చింగ్, వింగ్ యంగ్‌పై విజయం సాధించి తుదిపోరులో నిలిచింది.