పేరు కాదు.. డబ్బు రావాలి!

ప్రతి సినిమా నాకో సవాల్‌గా అనిపించాలి. కథ, పాత్ర చిత్రణలో కొత్తదనం ఉండాలి. అలాంటి ఛాలెంజింగ్ పాత్రలకే భవిష్యత్తులో నా ప్రాధాన్యత అని చెప్పింది సమంత. సాధారణంగా పెళ్లితో కథానాయికల కెరీర్ ముగిసిపోతుందని అంటారు. ఆ సిద్ధాంతాన్ని తిరగరాస్తున్నది సమంత. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుంది. అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో ప్రతిభను చాటుకుంటున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో సమంత చేసిన తాజా చిత్రం యూ టర్న్. పవన్‌కుమార్ దర్శకుడు. రేపు ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా సమంత సినిమా విశేషాల్ని పాత్రికేయులతో పంచుకుంది..

యూ టర్న్ రీమేక్‌ను అంగీకరించడానికి కారణమేమిటి?

కన్నడ యూ టర్న్ షూటింగ్‌లో ఉన్నప్పుడే బాగా తీస్తున్నారని తెలుసుకున్నా. ఇలాంటి కథతో సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. మూలకథలోని ఆత్మ చెడిపోకుండా వాణిజ్య హంగులను జోడించి దర్శకుడు పవన్‌కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఇందులో నేను పాత్రికేయురాలిగా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం హెయిర్‌కట్ చేసి కొత్తగా కనిపించాను. నా కెరీర్‌లో ఓ విభిన్నమైన పాత్ర ఇది.

నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు కూడా మీ సినిమాతో పాటే రిలీజ్ అవుతుంది కదా..?

భార్యకు భర్త సంతోషంగా కంటే ఏదీ ముఖ్యం కాదు. తన భర్త విజయాల్ని సాధించాలని ప్రతి భార్య కోరుకుంటుంది. చైతూ సినిమా హిట్టవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకే రోజు ఇద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని నేను ఊహించలేదు. అనుకోకుండా అలా జరిగింది.

ఈ రెండు సినిమాల్లో మీరు ఏది మొదట చూడబోతున్నారు?

విడుదల రోజు థియేటర్‌లో సినిమాలు చూడటం నాకు అలవాటు లేదు (నవ్వుతూ). ఆ రోజు నేను, చైతూ ఇంట్లో కూర్చొని సినిమాల ఫలితం కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తుంటాం.

సినీ కెరీర్ పరంగా ఈ ఏడాది మీకు బాగా కలిసివచ్చినట్లుంది?

పాత్రల పరంగా నేను తీసుకున్న రిస్క్‌లే విజయాల్ని తెచ్చిపెట్టాయి. రంగస్థలంలో పల్లెటూరి రామలక్ష్మిగా నటించాను. మహానటిలో టైటిల్ పాత్రలో కాకుండా కథను నడిపించే సహాయక పాత్ర చేశాను. ఆ తర్వాత కొత్త దర్శకుడిని నమ్మి అభిమన్యుడు సినిమా చేశాను. ప్రతి సినిమాలో రిస్క్‌లు తీసుకోవడం వల్లే సక్సెస్‌లు వచ్చాయి.

యూటర్న్ థీమ్‌సాంగ్‌లో మీరు చేసిన నృత్యాలు ఫేమస్ అయ్యాయి?

కెరీర్‌లో ఎక్కువగా పక్కింటి అమ్మాయి టైప్ పాత్రలే చేశాను. దాంతో డ్యాన్సులు చేయడానికి ఎక్కువగా అవకాశం రాలేదు. స్కూల్ రోజులనుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి వేడుకలో డ్యాన్స్ చేసేదాన్ని. ఈ పాటలో నా డ్యాన్స్ చూసిన చిన్ననాటి స్నేహితులంతా స్కూల్‌డేస్ నాటి సమంతను చూసినట్లుందని అంటున్నారు.

సినిమాల ఎంపికలో మీ ప్రాధామ్యాలు ఎలా ఉంటాయి?

కథ, పాత్రల పరంగా ప్రతి సినిమా నాకో ఛాలెంజ్‌గా ఉండాలని కోరుకుంటాను. సాధారణంగా అభినయానికి ప్రాధాన్యమున్న మంచి పాత్రలు హీరోయిన్లకు దొరకడం చాలా కష్టం. వాటి కోసం ఓపికగా ఎదురుచూడాలి. అలాంటివి దొరకని రోజు ఇంట్లో కూర్చుంటాను.

బిగ్‌బడ్జెట్ సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల కోసం పరిమితుల మధ్య షూటింగ్ చేయాల్సివుంటుంది కదా? యూ టర్న్ షూటింగ్ ఎలా సాగింది?

శక్తివంతమైన కథ కావడంతో షూటింగ్ సందర్భంగా కథానాయికలకు సమకూరే కొన్ని విలాసాల్ని పక్కన బెట్టాను. పూర్తిగా నా పాత్రకు న్యాయం చేయడంపైనే దృష్టిపెట్టాను.

పెళ్లి తర్వాత మీరు నాగచైతన్య కలిసి ఓ సినిమాచేయబోతున్నారు కదా? అది ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుంది?

ఆక్టోబర్ 6న మా తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రారంభమవుతుంది. శివ నిర్వాణ దర్శకుడు. అదే మా పెళ్లిరోజు కానుకగా భావిస్తున్నాను.

నిజం చెప్పాలంటే చాలా ఒత్తిడిగా ఉంది. స్టార్‌హీరోలెవరూ లేని సినిమా ఇది. సినిమా భారం మొత్తం నాపైనే ఉంది. సినిమా కోసం నిర్మాత పెట్టిన డబ్బులు తిరిగి రావాలి. వారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. సినిమా అనేది డబ్బుతో ముడిపడిన వ్యాపారం. బాక్సాఫీస్ రిజల్ట్‌నే విజయానికి నేను కొలమానంగా భావిస్తాను. మంచి పేరు ఎవరికి కావాలి. సినిమాకు డబ్బులు రావడం ముఖ్యం(నవ్వుతూ).

సినిమాల గురించి నిజాయితీగా నా అభిప్రాయాలు వెల్లడిస్తాను. పొగడటం నాకు రాదు. నాగచైతన్య సినిమాలో విషయంలో నా అభిప్రాయం ఏదైనా నిక్కచ్చిగా చెబుతాను.