సామి శత్రుసంహారం

సామి సినిమాతో దర్శకుడు హరి నా కెరీర్‌లో మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని దాదాపు పదిహేనేళ్లుగా వేచిచూశాం. మంచి కథ దొరకడంతో ఇన్నేళ్లకు ఆ కల నెరవేరింది అని అన్నారు హీరో విక్రమ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సామిస్వేర్. సామి (2003) చిత్రానికి సీక్వెల్ ఇది. హరి దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత మాస్ సినిమా చేయడం కొత్త అనుభూతిని కలిగించింది. తొలి భాగంలో ఎలా ఉన్నానో అదే ఆహార్యం, రూపురేఖలతో కనిపించడం సవాల్‌గా అనిపించింది. మహానటి తర్వాత మరోమారు అభినయప్రధాన పాత్రలో కీర్తిసురేష్ నటిస్తున్న సినిమా ఇది అని తెలిపారు.

తాను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిని తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేశారని, ఆ జాబితాలో ఈ సినిమా నిలుస్తుందని దర్శకుడు హరి చెప్పారు. బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2003లో వచ్చిన సామి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సీక్వెల్‌లో యజ్ఞోపవీతం ధరించిన పరశురామస్వామి అనే పోలీస్ అధికారి ఎలా శత్రుసంహారం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెల మూడోవారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.

Related Stories: