ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఆర్.ఆర్.ఆర్ ప్రారంభం

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టారు. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి అగ్రహీరో చిరంజీవి క్లాప్‌నివ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మా బ్యానర్‌లో తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నాను.నందమూరి, మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి అంచనాలను మించేలా నిర్మాణంలో ఎక్కడా రాజీపడబోము.

తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 19 నుంచి మొదలుపెడతాం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో భారీ సెట్‌లో రెండు వారాల పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, రానా, కల్యాణ్‌రామ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, దిల్‌రాజు, అల్లు అరవింద్, పీవీపీ, శోభు యార్లగడ్డ, యు.వి.క్రియేషన్స్ వంశీ, విక్రమ్, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, కె.ఎల్.నారాయణ, డి.సురేష్‌బాబు, నవీన్ ఎర్నేని, సి.వి.మోహన్, యలమంచిలి రవిశంకర్, సాయికొర్రపాటి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్, కథ: వి.విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కర్కీ, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌విజన్: వి.శ్రీనివాస్ మోహన్, కాస్ట్యూమ్ డిజైనర్: రమా రాజమౌళి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.