రూపాయి వెలవెల

-మరో ఆల్‌టైమ్ హైకి పతనం -24 పైసలు క్షీణించి 72.69కి చేరిక
ముంబై, సెప్టెంబర్ 11: డాలర్ ముందు రూపాయి వెలవెలబోతున్నది. రోజుకో రికార్డు స్థాయికి దిగజారుతున్నది. మంగళవారం కూడా మరో ఆల్‌టైమ్ హైకి క్షీణించింది. డాలర్‌తో పోల్చితే 24 పైసలు పతనమై 72.69కి రూపాయి మారకం విలువ పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు కూడా రూపాయిని ప్రభావితం చేస్తుండగా, ఓవైపు దేశం నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు.. మరోవైపు పెరుగుతున్న ముడి చమురు ధరలు డాలర్‌కు డిమాండ్‌ను తెచ్చిపెడుతున్నాయి. తరిగిపోతున్న డాలర్ నిల్వలూ దిగుమతిదారులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకానొక దశలో 72.74 స్థాయిని తాకింది. నిజానికి ట్రేడింగ్ ఆరంభంలో 20 పైసలు కోలుకుని 72.25 స్థాయికి బలపడిన సంకేతాలనిచ్చినప్పటికీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. బ్యాంకులు, ఎగుమతిదారులు అమ్మకానికి పెట్టిన డాలర్లకు దిగుమతిదారుల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో చివరకు నష్టాలు తప్పలేదు.

Related Stories: