సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఆరెస్సెస్.. కానీ!

నాగ్‌పూర్: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఆరెస్సెస్ స్వాగతించింది. అయితే అదే సమయంలో స్వలింగ వివాహాన్ని మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని, అది ప్రకృతి విరుద్ధమని సంఘ్ స్పష్టంచేసింది. సుప్రీంలాగే మేము కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు అని ఆరెస్సెస్ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గే మ్యారేజ్‌పై మాత్రం మా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. ఇది ప్రకృతి విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేం అంగీకరించే ప్రసక్తే లేదు అని ఆయన అన్నారు. భారత సంస్కృతి అలాంటి సంబంధాలను మొదటి నుంచీ గుర్తించడం లేదు అని అరుణ్‌కుమార్ చెప్పారు. 158 ఏళ్లుగా స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్న ఐపీసీ సెక్షన్ 377పై గురువారం ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును దేశవ్యాప్తంగా ఉన్న ఎల్జీబీటీ వర్గం స్వాగతించింది.
× RELATED వంతెన పైనుంచి మహానదిలో పడ్డ బస్సు