నాలుగ‌వ‌సారి.. నీర‌వ్ మోదీకి బెయిల్ ద‌క్క‌లేదు

హైద‌రాబాద్: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ‌వేసిన కేసులో ప‌రారీలో ఉన్న నీర‌వ్ మోదీ లండ‌న్ కోర్టులో బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇవాళ ఆ బెయిల్ పిటిష‌న్‌ను.. రాయ‌ల్ కోర్ట్స్ ఆఫ్ జ‌స్టిస్ తిర‌స్క‌రించింది. నీర‌వ్ మోదీకి బెయిల్‌ను తిర‌స్క‌రించ‌డం ఇది నాలుగ‌వ సారి. వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మూడు సార్లు నీరవ్ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో నాలుగోసారి హైకోర్టులో బెయి ల్ పిటీషన్ వేశాడు. మ‌రోవైపు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఉంచేందుకు జైలు గది సిద్ధమైంది. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న బ్యారక్ నెం. 12ను అధికారులు రెడీ చేశారని మంగళవారం మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. గత వారం జైళ్ల శాఖ.. ఆర్థర్ రోడ్డు కారాగారం స్థితిగతులను, అందులోని సదుపాయాలను రాష్ట్ర హోం శాఖకు తెలియపరిచింది. ఈ క్రమంలోనే నీరవ్‌ను అప్పగిస్తే అత్యంత భద్రత కలిగిన బ్యారక్ నెంబర్ 12లో పెట్టవచ్చని సదరు అధికారి పేర్కొన్నారు. ఇటీవలే ఈ విషయాన్ని కేంద్రానికి కూడా వివరించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లో నీరవ్ మోదీని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు నీరవ్‌ను భారత్‌కు అప్పగింత కేసును విచారిస్తున్న సంగతీ విదితమే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నీరవ్ మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ సైతం ఈ కుంభకోణంలో కీలక నిందితుడే. బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉండగా, మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూలు) జారీతో వేల కోట్లను కొల్లగొట్టారు.

Related Stories: