రంగును అడ్డుకుంటాం

విజయవాడకు చెందిన లారా అనే రౌడీషీటర్ జీవితం ఆధారంగా రంగు సినిమాను తెరకెక్కించామని దర్శకుడు కార్తికేయ, నిర్మాత పద్మనాభరెడ్డి ఇటీవలే ప్రకటించారని, లారా కుటుంబసభ్యులమైన మమ్మల్ని సంప్రదించకుండా ఈ సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు విజయవాడ తెలుగు యువతనేత సందీప్. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ అంటే రౌడీ షీటర్లు మాత్రమే ఉంటారనే ధోరణితో సినిమాలు తీయడం సరికాదని అన్నారు. పరిస్థితుల ప్రభావం వల్లనే లారా రౌడీగా మారాడని, వాస్తవాలు తెలుసుకోకుండా అతడి జీవితంపై సినిమా తీయడం సహేతుకం కాదని అగ్రహం వ్యక్తంచేశారు. లారా బంధువు దిలీప్ మాట్లాడుతూ మా కుటుంబాన్ని సంప్రదించకుండా దర్శకనిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమాకు తమకు చూపించిన తర్వాతే విడుదలచేయాలని, లేదంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.