ఆసీస్‌లో పరిస్థితులు వేరు

-టెస్ట్‌ల గురించి అలోచించడం లేదు -ధోనీ లేకపోవడం లోటే.. మీడియాతో రోహిత్‌శర్మ
చెన్నై: వెస్టిండీస్‌తో పోరు ముగిసింది. ఏకపక్షంగా ముగిసిన టెస్ట్ సిరీస్ నుంచి మొదలుపెడితే టీ20 సిరీస్ వరకు విండీస్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. సొంతగడ్డపై తమకు తిరుగులేదన్న రీతిలో టీమ్‌ఇండియా వరుస విజయాలతో మూడుకు మూడు సిరీస్‌లను దక్కించుకుంది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ..టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి కరీబియన్లను ఉత్తచేతులతో స్వదేశానికి పంపించాడు. పొట్టి ఫార్మాట్‌కు బ్రాండ్ అంబాసీడర్లుగా ముద్రపడ్డ కరీబియన్లను కుర్రాళ్ల కలయికతో కూడిన జట్టుతో క్లీన్‌స్వీప్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఆదివారం విండీస్‌తో మూడో మ్యాచ్ ముగిసిన అనంత రం రోహిత్ పలు అంశాలపై మాట్లాడాడు. ధవన్ ఫామ్‌లోకి రావడం, టెస్ట్‌లోకి తిరిగి ఎంపిక, కృనా ల్ ఆటతీరు, ధోనీ లేకపోవడం, ఆసీస్‌లో పరిస్థితులపై మీడియాతో ముచ్చటించాడు.

సొంతగడ్డపై పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. వెస్టిండీస్‌పై సిరీస్ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసం ఆసీస్ పర్యటనలో కచ్చితంగా ఉపయోగపడుతుంది. పేస్ బౌలింగ్‌కు సహకరించే ఆసీస్ పిచ్‌లపై రాణించడం కత్తిమీద సాములాంటిది. అయినా పరిస్థితులకు అనుగుణంగా మన ఆటను మలుచుకోవాలి. ఇలాంటి ప్రదర్శననే తిరిగి కొనసాగించాలి. ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణించినప్పటికీ..బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంకా కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుకోవాలి. - రోహిత్‌శర్మ

ధవన్ ఫామ్‌లోకి రావడం కీలకం

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఇబ్బంది పడ్డ శిఖర్ ధవన్ తిరిగి ఫామ్‌లోకి రావడం కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టుకు లాభించే అంశమని రోహిత్‌శర్మ అన్నాడు. విండీస్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్(53)తో కలిసి ధవన్(92) జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. తనదైన రీతిలో విండీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు కొల్లగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టు పరంగా ధవన్ తిరిగా ఫామ్‌లోకి రావడం చాలా కీలకం. వన్డేల్లో ధవన్ బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలుచలేకపోయాడు. మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం అతనిలో ఆత్మవిశ్వాసం నింపి ఉంటుంది. ఢిల్లీ డాషర్ రిషబ్ పంత్..ఆకలి గొన్న పులిలా కరీబియన్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు అని రోహిత్ అన్నాడు.

టెస్ట్‌ల గురించి ఆలోచించడం లేదు:

ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్ గురించి ఆలోచించడం లేదు. దాని కంటే ముందు ఈనెల 21నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పైనే దృష్టిసారించాను. దానికి తోడు టెస్ట్‌ల కంటే ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదు. అలాంటి వ్యక్తిత్వం కూడా నాది కాదు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడమనేది గౌరవంగా భావిస్తాను అని ఈ ముంబైకర్ అన్నాడు.

ధోనీ లేకపోవడం లోటే

వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో ధోనీ లేకపోవడం లోటుగానే కనిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవమున్న ధోనీ జట్టులో ఉంటే..జట్టుతో పాటు యువ ఆటగాళ్లకు బాగా ఉపయోగపడేది. భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించే సత్తా కృనాల్ పాండ్యాకు ఉంది. సోదరుడు హార్దిక్ పాండ్యా లాగా మైదానంలోకి దిగితే కడదాకా పోరాడే తత్వం కృనాల్‌ది అని రోహిత్ అన్నాడు.

అక్కడ కివీస్ లాగా ఉండదు...

న్యూఢిల్లీ: ఆడే పరిస్థితులు ఆస్ట్రేలియాలో లాగే న్యూజిలాండ్‌లో లేకపోయినా..సీనియర్ ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు బాగా ఉపయోగపడుతుందని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈనెల 16 నుంచి న్యూజిలాండ్‌లో భారత్ ఎ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడబోతున్నది. మౌంట్ మౌన్‌గనుయిలో మొదలయ్యే మొదటి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన రోహిత్‌శర్మ, రహానే, విజయ్, పార్థివ్‌పటేల్, హనుమ విహారి భారత్ ఎ తరఫున ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సిరీస్‌లకు ముందు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ దొరకడం లేదు.

విరామం లేకుండా అంతర్జాతీయ టోర్నీలు ఉండటమే దీనికి కారణం. భారత క్రికెట్ కోణంలో చూస్తే..యువకులకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి పర్యటనలను బీసీసీఐ రూపొందిస్తున్నది. దీని ద్వారా సీనియర్లతో కలిసి ఆడే అవకాశం జూనియర్లకు దక్కుతుంది. ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే న్యూజిలాండ్‌లో అలాంటి పరిస్థితులు లేకున్నా..అనుభవం మాత్రం కచ్చితంగా ఉపయోగపడుతుంది. గతంలోనూ ఇలాంటి పర్యటనలకు బోర్డు రూపకల్పన చేసింది. వీటి ద్వారా బెంచ్ బలగాన్ని బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌లో ఇది సాధ్యమైంది..కానీ ఆస్ట్రేలియాలో చేయలేకపోతున్నాం. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు భారత్ కేవలం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది అని ద్రవిడ్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్‌ల సిరీస్ వచ్చే నెల 6న అడిలైడ్‌లో మొదలవుతుంది.