దారిదోపిడీ ముఠా అరెస్టు...

ఉప్పల్ : మోటార్‌సైకిల్‌పై వస్తారు.. ప్రమాదం జరిగిందని లారీని నిలిపివేస్తారు.. కిందపడిపోయినట్లు నటిస్తూ లారీని ఆపేస్తారు.. డ్రైవర్ వద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కొని వెళ్లిపోతారు. జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం కొత్తరకం ఆలోచనతో దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన పవన్‌కుమార్(24), అంబర్‌పేట వడ్డెరబస్తీకి చెందిన వెంకటేశ్(19), ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న అంబర్‌పేట కుమ్మరివాడి భానుప్రకాశ్(23), పాములబస్తీకి చెందిన సాయికుమార్(23), వ్యాపారం నిర్వహించే బాగ్‌అంబర్‌పేట సాయిక్రిష్ణానగర్‌కు చెందిన హరిశంకర్(43), మరో ఇద్దరు మైనర్లు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ముఠాగా ఏర్పడ్డారు. ప్రమాదం జరిగిందని లారీలను నిలిపివేసి.. డ్రైవర్‌ను బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు దోచుకువెళ్తున్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం నుంచి ఇసుకలోడును తీసుకువచ్చి, ఆన్‌లోడ్ చేసి జూన్ 12న ఇంటికి వెళ్తున్న లారీని ఉప్పల్ మెట్రోస్టేషన్ వద్ద నిలిపి.. డ్రైవర్ వద్దనుంచి నగదు, సెల్‌పోన్‌ను దోచుకుపోయిన సంఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా రామంతాపూర్ రోడ్డులో తనిఖీలు చేస్తుండగా... వాహనాలపై వచ్చిన యువకులను ఆపారు. వాహన పత్రాలు అడుగగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీ విషయం తెలిసింది. ఈ మేరకు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలురను జువైనల్ హోంకు తరలించారు. వారినుంచి 15 సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, డీఐ ఎస్.రవిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: