సుప్రీంకోర్టు తీర్పుపై లోధా అసంతృప్తి

న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా.. సంస్కరణలతో కూడిన బీసీసీఐ కొత్త ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి సారథ్యం వహించిన వ్యక్తి. అయితే తాను సూచించిన సిఫారసుల్లో కీలకమైన ఒక రాష్ట్రం.. ఒక ఓటు నిబంధనను సుప్రీంకోర్టు తొలగించడంపై లోధా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముందున్న పరిస్థితులే పునరావృతమయ్యాయని నేను అనను. అయితే కీలక సంస్కరణలను మార్చడం నన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. సంస్కరణల మౌలిక స్వరూపాన్ని ఇది బలహీనపరిచింది అని లోధా అన్నారు. 2016లోనే సంస్కరణలకు ఓకే చెబుతూ వాటిని అమలు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ను కూడా నియమించిందని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు రెండేళ్ల తర్వాత సీవోఏ చెప్పినా.. ఆ సంస్కరణలను అమలు చేయలేదు అని లోధా ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సంస్కరణలన్నీ సిఫారసు చేయడానికి తమకు ఏడాదికిపైగా సమయం పట్టిందని చెప్పారు. లోధా సిఫారసు చేసిన ఒక రాష్ట్రం.. ఒక ఓటు నిబంధనను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో గుజరాత్, మహారాష్ట్రలకు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం దక్కింది. ఈ రెండు రాష్ర్టాలకు మూడేసి అసోసియేషన్లు ఉన్నాయి. ఇక రైల్వేస్, యూనివర్సిటీస్‌లకు కూడా ఓటు హక్కు పునరుద్ధరించడంపై లోధా అసంతృప్తిగా ఉన్నారు. తాము రైల్వేస్ టీమ్‌ను రంజీట్రోఫీలాంటి వాటిలో ఆడకుండా నిషేధించలేదని, అయితే ప్రభుత్వ జోక్యం మాత్రం ఉండకూడదని చెప్పినట్లు గుర్తుచేశారు. రైల్వేస్, యూనివర్సిటీస్‌కు ఓటు హక్కు కల్పించడం వల్ల వాటిని మానవ వనరుల శాఖ, రైల్వేస్ శాఖలే వేస్తాయని, అది ప్రభుత్వ జోక్యం కిందికే వస్తుందని లోధా స్పష్టంచేశారు. ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఇవ్వడం వల్ల ఒకటే ఓటు ఉన్న బీహార్, యూపీలాంటి రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుంది అని లోధా అన్నారు.

× RELATED కుంభమేళాతో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం