మూడేండ్లుగా సార్ బిజీ!

-సర్వేయర్ కార్యాలయం చుట్టూ ఓ మహిళ ప్రదక్షిణలు.. -2016లో భూ సర్వేకు ఫీజు చెల్లింపు -అప్పటి నుంచి రేపు, మాపు అంటూ తిప్పుతున్న సర్వేయర్ -తాసిల్దార్‌ను కలిసినా ప్రయోజనం శూన్యం.. -భూ సర్వే కోసం భగీరథి కష్టాలు
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రెవెన్యూ అధికారులు ఆఫీసుల్లో ఉండరనే విషయం గ్రామాల్లో ఎవ్వరిని అడిగినా ఇట్టే చెప్తారు. సార్ ఎక్కడికి పోయారని తప్పిపోయి ఎవరినైనా ప్రశ్నిస్తే.. హెడ్డాఫీస్ పోయిండు.. పెద్దసార్లతో మీటింగ్ల ఉన్నడు.. సర్వే పనుల్ల బిజీగ ఉన్నడు.. లాంటి మాటలే మనకు వినిపిస్తాయి. రెండు, మూడు రోజులుగా వస్తున్నా కనిపించడం లేదని ఏ నాయకుడో నిలదీస్తే.. లీవ్‌లో ఉన్నాడంటూ కిందిస్థాయి సిబ్బంది అబద్ధం చెప్పి పూటగడిపేస్తారు. ఆఫీసులకు రాకుండా బిజీగా ఉండేంత పనులు వీరికేముంటాయి? నిజంగానే పై అధికారులు మీటింగ్‌లంటూ వేధిస్తున్నారా? సర్వే పనుల్లో నిత్యం బిజీగా ఉండటమేనా? వంటి ప్రశ్నలు ఉద్భవిస్తుంటాయి. ఓ వైద్యురాలు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నా.. మూడేండ్లుగా బిజీగా ఉన్నానంటూ కాలం వెళ్లదీస్తున్నాడు ఝరాసంగం సర్వేయర్.

నాలుగెకరాలు.. మూడేండ్లు..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్‌కు చెందిన డాక్టర్ భగీరథికి వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. గ్రామ పరిధిలో తనకు ఉన్న 4.34 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. చెరుకు, కూరగాయలు పండిస్తున్నారు. మౌఖికంగానైనా చెప్పకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భూమిలో నుంచి రోడ్డు వేశారు. మరికొంత భూమి పరాధీనం అయ్యిందనే అనుమానం వచ్చింది. 2016 ఏప్రిల్ 22న ఖాతా నంబర్ 276, సర్వే నెంబరు 166 పేరున భూమి సర్వే చేయాలని కోరుతూ రుసుము చెల్లించారు. ఎంతగా ఎదురుచూసినా సర్వే చేసేందుకు ఎవరూ రాకపోవడంతో ఝరాసంగం రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించారు. సర్వేయర్ లాల్‌సింగ్‌ను కలువగా.. మీరు ఇప్పుడే ఫీజు కట్టారు? మీ కన్నా ముందు చెల్లించినవారు చాలా మంది ఉన్నారు. మీ వంతు వచ్చినప్పుడు రండి అని ముఖంపై కొట్టినట్టే చెప్పారు. మరికొన్ని రోజుల తర్వాత మరోసారి వెళ్లగా.. ఇక్కడికి వచ్చి మా పనులకు డిస్టర్బ్ చేయవద్దు. సర్వే చేసేందుకు వచ్చే ముందు సమాచారం ఇస్తాం అంటూ సర్వేయర్ లాల్‌సింగ్ గద్దించాడు. రోజులు గడుస్తున్నా సర్వే మాత్రం చేపట్టకపోవడంతో తన భర్త గౌరీశంకర్‌తో కలిసి వెళ్లి అధికారులను కలిశారు. తాసిల్దార్ అందుబాటులో లేకపోవడంతో.. గౌరీశంకర్ పరిస్థితిని ఫోన్‌లో వివరించారు. తాసిల్దార్ నుంచి కూడా స్పందన రాలేదు. చాలాసార్లు రేపు సర్వేకు వస్తున్నట్టు చెప్పిన లాల్‌సింగ్.. భూమి వద్ద ఎదురుచూస్తుండగా అధికారులు మరో పని అప్పగించారని చెప్పేవారు. ఇలా ఎదురుచూస్తూ ఉండగానే మూడేండ్లు గడిచిపోయాయి. భగీరథి భూమి కూడా సర్వే కాకుండా అలాగే ఉండిపోయింది.

పరాధీనమైందని అనుమానం

భగీరథి.. చిన్న పనికోసం మూడేండ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తన 4.34 ఎకరాల భూమిలో కొంత స్థలం పరాధీనం అయిందనే అనుమానంతో పక్కా కొలతల కోసం సర్వే రుసుము చెల్లించి సర్వేయర్ ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు భూమి కొలతలు చేస్తాడా? అంటూ మూడేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆమె ఎప్పుడు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా.. రేపు, మాపు అంటూ సర్వేయర్ తిప్పి పంపిస్తూనే ఉన్నాడు. ఫోన్ చేసినా, స్వయంగా వెళ్లి కలిసినా.. నేను బిజీ అనే మాట మాత్రమే సర్వేయర్ నోటి నుంచి వస్తున్నది. గడిచిన మూడేండ్లుగా ఆయన బిజీగానే ఉంటున్నాడు. భూమి సర్వే కూడా పెండింగ్‌లోనే ఉంటూ వస్తున్నది. చిన్న పనికి ఏండ్లుగా ఆఫీసు చుట్టూ తిప్పుకొంటూ ఇబ్బందులు పెడుతున్నారంటూ డాక్టర్ భగీరథి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం

25 ఏండ్లపాటు వైద్యవృత్తిలో కొనసాగిన నేను.. ఎవరి బాధలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలను. అధికారుల పని ఒత్తిడి ఎలా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకోగలను. మూడేండ్లుగా పనిచేయకపోవడాన్ని ఏమంటారు? రెవెన్యూ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సర్వే రుసుము చెల్లించి ఏండ్లుగా సర్వేయర్ చుట్టూ తిరిగినా కనీసం స్పందన లేదు. సర్వే చేయడానికి ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారో కూడా అర్థం కావడం లేదు. ధర్మగంట పేరుతో నమస్తే తెలంగాణ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యావంతురాలినైన నాలాంటి వారినే ఇంతలా ఇబ్బందులు పెడుతున్నారంటే.. పేద రైతుల పరిస్థితి ఊహించుకోలేకపోతున్నా. ఫీజు కడితే సరిపోదంట. లంచం ఇవ్వనందుకే నా భూమి సర్వే చేపట్టలేదని ఇతరుల ద్వారా తెలుసుకున్నా. ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడానికి బదులుగా ఇంత లంచం ఇస్తేనే పని మొదలెడతాం అని చెప్పితే.. నాలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ కార్యాలయం చుట్టూ తిరుగకుండా ఉండే బాధ తప్పుతుంది. రెవెన్యూ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నడుంకట్టడం అభినందనీయం. కొత్తగా పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకంలో నా భర్త గౌరీశంకర్ పేరును తండ్రిగా నమోదు చేశారు. మార్పించుకోవడానికి రెండునెలల సమయం పట్టింది. మూడేండ్లుగా సర్వేయర్ ఎన్ని సర్వేలు పూర్తిచేశాడు? తన భూమి సర్వే చేయకుండా ఏం ఒరగబెట్టాడో తాసిల్దార్ ఆరా తీశారా? ఈ విషయంలో ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వాలి. - డాక్టర్ భగీరథి, కుప్పాసాగర్, ఝరాసంగం, సంగారెడ్డి జిల్లా

Related Stories: