మరో నయీం ఉమర్‌ఖాన్!

-కనపడ్డ భూమినల్లా కబ్జా -20 మందితో ముఠా.. -ఎదురు తిరిగితే దాడులు.. చంపుతామని బెదిరింపులు -పోలీసులు, రెవెన్యూ అధికారుల కుమ్మక్కు -ఉమర్ గుప్పిట్లో ప్రజాప్రతినిధులు -వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో భూదందా -భయంతో వణికిపోతున్న ప్రజలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నయా నయీం వెలుగులోకి వచ్చాడు. పదేండ్ల క్రితం సామాన్య లారీడ్రైవర్‌గా పనిచేసిన ఉమర్‌ఖాన్ ప్రస్తుతం భూకబ్జాలకు పాల్పడుతూ రూ.కోట్లకు పడగలెత్తాడు. 20 మంది గ్యాంగ్‌తో తిరుగుతూ విలువైన భూముల కబ్జాకు పాల్పడే ఉమర్‌ఖాన్.. దాదాపు 200 ఎకరాలను కబ్జాచేసినట్లు ఆరోపణలున్నాయి. కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల అండదండలతో అతడు కబ్జాలకు పాల్పడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. తమ భూములను కబ్జాచేశాడు.. తమకు న్యాయంచేయాలంటూ వెళ్తే పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు.. కార్యాలయానికి ఉమర్‌ఖాన్ వస్తే రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమర్‌ఖాన్‌తో కలిసి స్థానిక ఎస్‌ఐ భూదందా నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉమర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదుచేసిన బాధితులపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తుండటం గమనార్హం. అయితే, తమ భూములు కబ్జా అయ్యాయని ఓ రెవెన్యూ డివిజన్ ఉన్నతాధికారి వద్దకువెళ్తే.. అతని వెంట గ్యాంగ్ ఉన్నది.. మిమ్మల్ని ఏమైనా చేస్తారు.. మీ భూములను వదిలేసుకొనివెళ్లండంటూ కబ్జాదారుడు ఉమర్‌ఖాన్‌కు మద్దతుగా సదరు అధికారి మాట్లాడినట్టు బాధితులు చెప్తున్నారు. కబ్జాకు గురైన తమ భూముల కోసం బాధితులు ఎదురుతిరిగితే సంబంధిత కుటుంబంపై దాడులుచేసి, చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పూడూర్ మండలం చన్గొముల్ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూకబ్జాలకు గురైన ఏ ఒక్కరూ ఉమర్‌ఖాన్ గురించి వివరాలు చెప్పేందుకు ముందుకు రావడంలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. గత పదేండ్లుగా పోలీస్‌స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి ఆలసిపోయిన కొందరు బాధితులు ధైర్యంగా ముందుకువచ్చి తమకు న్యాయంచేసి తమ భూములను తిరిగి ఇప్పించాలంటూ ధర్మగంటను ఆశ్రయించారు. సదరు కబ్జాదారుడికి వెంటుండి ప్రోత్సహిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయంచేయాల్సిన అవసరం జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీపై ఎంతైనా ఉన్నది. ఈ విషయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించినట్టయితే ఇంకా చాలామంది ఉమర్‌ఖాన్ బాధితులు బయటకువచ్చే అవకాశముందని బాధితులు అంటున్నారు.

గొల్ల వెంకటయ్య

1.30 ఎకరాల భూమిని ఆక్రమించారు

కుత్బుల్లాపూర్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 204, 205లో మాకున్న ఎకరా 30 గుంటల భూమిని ఉమర్‌ఖాన్ కబ్జాచేశాడు. నా పేరిట ఉన్న భూమిని ఉమర్‌ఖాన్, స్థానిక ఎస్‌ఐ, రెవెన్యూ అధికారులు అందరూ కుమ్మక్కై ఉమర్‌ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2015-16 వరకు రికార్డుల్లో నా పేరిట ఉన్నప్పటికీ ఆ తర్వాత రికార్డుల్లో మార్చేశారు. రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా, తాసిల్దార్ నామమాత్రంగా పేషీ పెట్టి, ఉమర్‌ఖాన్ పేరిట రికార్డుల్లో మార్చారు. ఆ తర్వాత కోర్టుకువెళ్లగా అనుకూల తీర్పు వచ్చినప్పటికీ ఇప్పటికీ న్యాయం జరుగలేదు. ఆర్డీవో విచారణ చేస్తున్నామని చెప్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపడంలేదు. - గొల్ల వెంకటయ్య, తిమ్మాపూర్ గ్రామం

సాయిరెడ్డి

పాస్‌బుక్ వచ్చింది...రైతుబంధు రాలేదు...

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుగా ఉన్నది సుంకెట్ గ్రామానికి చెందిన చింతపల్లిసాయిరెడ్డి పరిస్థితి. 783-3-2 సర్వేనంబర్‌లో 1.26 ఎకరాలు, 784-2లో 23 గుంటల భూమి ఉన్నది. దీనికి సంబంధించి నూతన పాస్‌బుక్ వచ్చింది. కానీ, రైతుబంధు రావడంలేదు. రైతుబీమా పత్రం ఇవ్వలేదు. తనకు రైతుబంధు, రైతుబీమా వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సాయిరెడ్డి కోరుతున్నారు.

ఎండీ రహీంఖాన్, ప్రధానోపాధ్యాయుడు

22. 33 ఎకరాల భూమిని కాజేశాడు

15 ఏండ్లుగా మా భూమిని ఉమర్‌ఖాన్ కబ్జాచేశాడు. చేవెళ్ల మండలం తంగేడుపల్లి గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 51, 60, 164, 182 లోని 22 ఎకరాల 33 గుంటల భూమిని ఉమర్‌ఖాన్ కబ్జాచేశాడు. కోర్టులో మాకు అనుకూల తీర్పువచ్చినా కబ్జాదారుడు ఇచ్చే డబ్బులతో పోలీసులు మా భూమిని తిరిగి మాకు ఇప్పించలేకపోయారు. మాకు న్యాయంచేయండంటే చంపుతామని బెదిరిస్తున్నారు. కబ్జాదారుడిని అరెస్ట్‌చేస్తే.. మాలాంటి చాలామంది బాధితులు బయటకువస్తారు. -ఎండీ రహీంఖాన్, ప్రధానోపాధ్యాయుడు, బాలానగర్

అమృతమ్మ

పదేండ్లుగా తిరుగుతున్నా..

నా పేరు అమృతమ్మ. మాది మల్కాపురం గ్రామం. మాకు చెందిన సర్వేనంబర్ 215 అ/2/1లోని ఎకరా 39 గుంటల భూమిని ఉమర్‌ఖాన్ కబ్జాచేశాడు. పదేండ్లుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ, తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. అయితే సంబంధిత భూమికి మా పేరిట పాస్‌పుస్తకాలు వచ్చినప్పటికీ కబ్జాలో మాత్రం ఉమర్‌ఖాన్ ఉన్నాడు. మేం మా భూమిలో సాగుచేసేందుకువెళ్తే మాపై దాడులుచేసి చంపుతామని బెదిరిస్తున్నారు. - అమృతమ్మ, మల్కాపురం గ్రామం

అపూర్వ మహేష్‌కుమార్

ఐదున్నర ఎకరాలను కొట్టేశాడు

చన్గొముల్ గ్రామ పరిధిలోని 253/6, 7,6/2, 6/2ఎలోని ఐదున్నర ఎకరాలను ఉమర్‌ఖాన్ కబ్జాచేశాడు. తొలుత మా భూమిని తక్కువ మొత్తానికి ఇవ్వాలని బెదిరించారు, మేం కుదరదని చెప్పాం. అయితే, 2017లో ఉమర్‌ఖాన్ మా భూమిని కబ్జాచేశాడు. పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. ఉమర్‌ఖాన్‌తోకలిసి అప్పటి ఎస్‌ఐ ఆంజనేయులు ఫిర్యాదుచేసిన నాపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ బెదిరించారు. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫలితంలేదు. కబ్జాకు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌తోపాటు డీజీపీకి లేఖలు రాసినప్పటికీ స్థానికంగా ఉన్న పోలీసులు మాకు న్యాయం జరుగకుండా ఉమర్‌ఖాన్‌కు సపోర్ట్ చేస్తున్నారు. - అపూర్వ మహేష్‌కుమార్

అబ్బాస్‌ఖాన్

17 ఏండ్లుగా తిరుగుతున్నా

చన్గొముల్ గ్రామంలోని సర్వేనంబర్ 304(ఎ), 305(ఎ)లోని 4 ఎకరాల 36 గుంటల భూమిని 2003లో ఉమర్‌ఖాన్ కబ్జాచేశాడు. గత 17 ఏండ్లుగా పోలీస్‌స్టేషన్, రెవెన్యూ కార్యాలయం చుట్ట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఇప్పటికీ న్యాయం జరుగలేదు. స్థానికంగా పోలీసు, రెవెన్యూ అధికారుల అండదండలతో మాపై దాడులు చేయడంతోపాటు మమ్మల్ని చంపేస్తామంటూ కబ్జాదారుడు బెదిరిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం కూలీ పనిచేసుకొని బతుకుతున్నాము. మాకు న్యాయంచేసి, మా భూమి మాకు ఇప్పించండి. -అబ్బాస్‌ఖాన్, గౌశాబేగం దంపతులు, చన్గొముల్ గ్రామం

పట్టెం రాజయ్య

కొత్త పాస్‌బుక్ ఇవ్వడం లేదు

నిజామాబాద్ రూరల్ జిల్లాలోని పాల్దా గ్రామంలో భూమిలేని నిరుపేదలకు 1985లో ప్రభుత్వం భూమిని ఇచ్చింది. ఆ గ్రామస్థుడైన పట్టెం రాజయ్యకు 1.12 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ భూమికి సంబంధించిన ఆర్డర్ కాపీ పోగొట్టుకోవడంతో అధికారులు కొత్త పాస్‌బుక్ ఇవ్వకుండా జాప్యంచేస్తున్నారు. దీని గురించి రాజయ్య కొడుకు పలుమార్లు తాసిల్దార్‌కు మొరపెట్టుకొన్నారు. ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారు తన సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తన తండ్రి పేరిట ఉన్న భూమికి కొత్త పాస్‌బుక్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Stories: