రిలయన్స్ చేతికి ఆరు రిటైల్ కంపెనీలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రెడీమేడ్ గార్మెంట్స్ హోల్‌సేలర్, రిటైర్ కంపెనీ జెనెసిస్ కలర్స్‌లో 16.31 శాతం వాటను రూ. 34.80 కోట్లకు రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్. కాగా, రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్‌కు జెనిసిస్ కలర్స్‌లో ఇప్పటికే 49.46 శాతం వాటా ఉంది. దీంతో జెనిసిస్ కలర్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మొత్తం వాటా 65.77శాతానికి చేరుకుంది. ఇదిలాఉండగా, మరో ఐదు కంపెనీలలో కూడా రూ 57.03 కోట్లతో వాటాలను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ఆదివారం స్టాక్‌ఎక్సేంజిలకు పంపిన సమాచారంలో పేర్కొంది. ఈ ఐదు కంపెనీలు, రెడీమేడ్ గార్మెంట్స్, బ్యాగులు, ఫుట్‌వేర్ రంగాలలో నిమగ్నమై ఉన్నాయి. జీఎల్‌ఎఫ్ లైఫ్‌ైస్టెల్‌లో 50 శాతం వాటాను రూ. 38.45 కోట్లకు కొనుగోలు చేసింది. జెనిసిస్ లా మోడ్‌లో 50 శాతం వాటాను రూ. 10.57 కోట్లకు కొనుగోలు చేయగా, జెనిసిస్ లగ్జరీ ఫ్యాషన్‌లో 2.07 శాతం వాటాను రూ. 3.37కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రిలయన్స్ రిటైల్ కు ఈ కంపెనీలో మొత్తం వాటా 49.37 శాతానికి చేరింది. కాగా, జీఎంఎల్ ఇండియా ఫ్యాషన్, జీఎల్‌బీ బాడీ కేర్ కంపెనీలలో 50 శాతం చొప్పున వాటాలను కొనుగోలు చేసింది. వీటీ కోసం రూ. 4.48 కోట్లు, రూ. 16 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టింది. రిటైల్ పరిశ్రమలో మరింత విస్తరించడానికి ఈ వాటాల కొనుగోలు దోహదపడుతుందని తెలిపింది.

Related Stories: