తుస్సుమన్న అళగిరి బలప్రదర్శన

-చెన్నైలో పెద్దగా ప్రభావం చూపని మద్దతుదారుల ర్యాలీ -పేలవంగా సాగిన డీఎంకే మాజీ నేత ప్రసంగం
చెన్నై, సెప్టెంబర్ 5: డీఎంకే బహిష్కృత నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు ఎం కరుణానిధి పెద్ద కొడుకు ఎంకే అళగిరి బుధవారం తలపెట్టిన బల ప్రదర్శన తుస్సుమన్నది. తండ్రి మరణానంతరం తిరిగి పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్న అళగిరి చెన్నైలో భారీ సభను తలపెట్టారు. కానీ పట్టుమని పదివేల మంది కూడా సభకు హాజరు కాకపోవడంతోపాటు అళగిరి ప్రసంగం పేలవంగా సాగింది. తన తమ్ముడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ఎటువంటి విమర్శలు చేయకుండానే ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. తన తదుపరి కార్యాచరణను కూడా అళగిరి ప్రకటించలేదు. డీఎంకే నుంచి సస్పెండ్ చేసిన తనను తనను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలంటూ అళగిరి కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు బుధవారం వల్లజా రోడ్డు నుంచి మెరీనాబీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు ర్యాలీ నిర్వహించారు. ఓపెన్ టాప్ వ్యాన్ నుంచి ప్రసంగించిన అళగిరి.. ర్యాలీలో లక్షన్నర మంది పాల్గొన్నారని, డీఎంకే నేతలు వారందరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తారా అని అళగిరి ప్రశ్నించారు.

Related Stories: