రూపాయికి చిల్లులు

-ఒకానొక దశలో రూ.72.67కు దిగజారిన మారకం -గరిష్ఠంగా 94 పైసల పతనం
ముంబై, సెప్టెంబర్ 10: రూపాయి..రూపాయి నువ్వు ఏమవుతావు అంటే నేను పతనమవుతాను తప్పా..పెరుగను కాక పెరుగను అంటున్నది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 13 శాతానికి పైగా పతనమైన కరెన్సీ విలువ సోమవారం చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 72 స్థాయిని దాటి రూ.72.45 వద్ద ముగిసింది. అంతర్జాతీయ దేశాల మధ్య వాణిజ్య యుద్దం తీవ్రతరమవుతుండటం, మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితుల భయాలు చుట్టుముట్టడంతో కరెన్సీ భారీ పతనాన్ని మూటగట్టుకున్నది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం ఒక దశలో డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 94 పైసలు పడిపోయి కనిష్ఠ స్థాయి రూ.72.67కి జారుకున్నది. ఆ వెంటనే రిజర్వు బ్యాంక్ జోక్యం చేసుకోవడంతో భారీ పతనాన్ని తగ్గించుకోగలిగింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 72 పైసలు తగ్గి రూ.72.45 వద్ద స్థిరపడింది. ఆగస్టు 13 తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనమడం ఇదే తొలిసారి. చైనా దిగుమతులపై మరో 267 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఫారెక్స్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి.

గత శుక్రవారం 26 పైసలు కొలుకున్న రూపాయి ఈ వారం ప్రారంభంలోనే భారీ పతనం చెందింది. దేశ వాణిజ్యలోటు ఆందోళనకర స్థాయికి చేరుకోవడం, స్వల్పకాల రుణాలు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా దేశాలు రక్షణచర్యలు కరెన్సీ పతనానికి ప్రధాన కారణమని ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న క్రూడాయిల్ ధరలు ఫారెక్స్ మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 2.4 శాతంగా నమోదైంది. రూపాయి పతనం దెబ్బకు ఫారెక్స్ నిల్వలు కూడా కరిగిపోతున్నాయి. ఆగస్టు 31తో ముగిసిన వారాంతానికి భారత్ వద్ద 400.101 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. రూపాయి బలపడటంతో గడిచిన కొన్నేండ్లుగా విదేశీ మారకం నిల్వలు భారీగా పెరిగాయి. పౌండ్‌తో పోలిస్తే రూ.93.66కి జారుకోగా, యెన్‌తో పోలిస్తే రూ.65.21 వద్ద ముగిసింది. మారకం పతనంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ ప్రభావం చూపుతుందని పేర్కొంది.