విదేశాల్లో రాణిస్తున్న జట్లేవీ!

- భారత్‌పైనే విమర్శలు ఎందుకు? - చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఆవేదన
బ్రిస్బేన్: స్వదేశంలో పులి.. విదేశాల్లో పిల్లి... భారత్ క్రికెట్ జట్టుపై ఎన్నాళ్లో నుంచో ఉన్న విమర్శ ఇది. అయితే ఇటీవలి కాలంలో మిగతా జట్లు కూడా విదేశాల్లో రాణించడం లేదని, అలాంటప్పుడు ప్రత్యేకంగా టీమ్‌ఇండియాపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఒక జట్టును లక్ష్యంగా చేసుకుని దాని ప్రదర్శన గురించి మాట్లాడటం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసీస్‌లో సిరీస్ గెలువడం ఎంత ముఖ్యం అన్న ప్రశ్నకు శాస్త్రి జవాబిచ్చాడు. చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. మనతో పాటు విదేశాల్లో పర్యటిస్తున్న చాలా జట్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. 90ల్లో ఆసీస్ కొంత బాగా ఆడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా చెలరేగింది. ఈ రెండు మినహా.. గత ఐదారేండ్లలో విదేశాల్లో అద్భుతంగా ఆడిన జట్లేవీ? అలాంటప్పుడు కేవలం భారత్‌నే వేలెత్తి ఎందుకు చూపిస్తున్నారు. విదేశాల్లో ఓడిపోతామనే ట్యాగ్ మాకు మాత్రమే ఎందుకు అని శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.

తప్పులు దిద్దుకోలేకపోయాం..

తాము చేసిన కొన్ని పొరపాట్ల వల్లే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో సిరీస్‌లు కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో స్కోర్లు ఎప్పుడూ వాస్తవాలు చెప్పవు. మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు వస్తుంటాయి. అద్భుత అవకాశాలను కూడా మేం దారుణంగా వదిలేసుకున్నాం. చివరకు వీటి మూల్యమే సిరీస్ ఓటమి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో నాలుగు రోజుల్లో కంటే సెషన్‌లోని ఒకే ఒక్క గంటలో మ్యాచ్ పరిస్థితులు తారుమారవుతాయి అని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు.

ఆసీస్ బలహీనం కాదు..

గత కొన్ని నెలలుగా ఆసీస్ జట్టు తమ ఆధిపత్యాన్ని కోల్పోయిందని వస్తున్న వాదనను శాస్త్రి తోసిపుచ్చాడు. ఆసీస్ ఇప్పటికీ బలమైన జట్టేనన్నాడు. జట్టులో క్రీడా సంస్కృతి పాతుకుపోయినప్పుడు ఎన్ని ఎత్తు పల్లాలు ఎదురైనా అది అలాగే కొనసాగుతుంది. స్వదేశంలో ఏ జట్టు బలహీనం కాదు. ఏవో కారణాల వల్ల ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు ఆడనప్పుడు ఆ జట్టు బలహీనమని అనుకుంటే పొరపాటే అని రవి వెల్లడించాడు.

హార్దిక్ లేకపోవడం లోటే..

ఆసీస్ పిచ్‌లపై తమ పేసర్లు బౌలింగ్‌ను ఆస్వాదిస్తారని కోచ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ పిచ్‌లపై రాణించాలంటే ఫిట్‌గా ఉండి సమిష్టిగా ఆడటమే. హార్దిక్ లేకపోవడం పెద్ద లోటే. ఎక్స్‌ట్రా బౌలర్‌ను ఆడించుకునే అవకాశాన్ని కోల్పోయాం. పాండ్యా ఉండి ఉంటే జట్టు సమతూకంగా ఉండేది. తొందరల్లోనే ఫిట్‌నెస్ సాధిస్తాడని అనుకుంటున్నాం. ప్రత్యర్థి లైనప్‌ను దృష్టిలో పెట్టుకోకుండా నిలకడగా బౌలింగ్ చేసే వారే తుది జట్టులో ఉంటారు. గతంలో ఒకరిద్దరు మంచి స్పెల్ వేసేవారు. అయితే మూడు, నాలుగు, ఐదు గంటలు బౌలర్లందరూ సమిష్టిగా కదంతొక్కాలి. అప్పుడే ప్రత్యర్థి లైనప్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మనకు కూడాఓ పరీక్ష మాదిరిగా ఉంటుంది అని చీఫ్ కోచ్ వ్యాఖ్యానించాడు.