కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక

ముగ్ధమనోహర సౌందర్యం, మైమరిపించే అభినయం మేలికలయికగా యువకుల హృదయాల్ని దోచుకుంటున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఛలో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ సొగసరి గీత గోవిందం సినిమాతో యూత్‌లో మంచి సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నది. ఇదిలావుండగా రష్మిక మందన్న తమిళంలో బంపర్‌ఆఫర్‌ను సొంతం చేసుకుంది.

అరంగేట్ర చిత్రంలోనే తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ సరసన నాయికగా నటించే సువర్ణావకాశాన్ని సంపాదించుకుంది. వివరాల్లోకి వెళితే..ఇటీవలే సర్కార్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు విజయ్. తాజాగా ఆయన అట్లి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. దాదాపు 125కోట్ల భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా ఖరారైంది. ఈ సుందరి ప్రస్తుతం కన్నడంలో రెండు సినిమాల్లో నటిస్తున్నది. తెలుగులో కూడా పలు ఆఫర్లు వరిస్తున్నట్లు తెలిసింది.

Related Stories: