e తరం వాహనాలు

-కరెంటే..ఇంధనం -కాలుష్య రహితం -నగరంలోకి ప్రవేశించిన ఎలక్ట్రిక్ బైకులు, కార్లు -కొన్ని వాహనాలకే చార్జింగ్ సదుపాయం -మరికొన్నింటిలో బ్యాటరీ చార్జింగ్ సౌకర్యం -బైకు చార్జింగ్‌కు ఖర్చయ్యే విద్యుత్ 3 యూనిట్లలోపే -కిలోమీటరు ప్రయాణం ఖర్చు 20 పైసలే -త్వరలోనే అందుబాటులోకి చార్జింగ్ కేంద్రాలు వినయకుమార్ పుట్ట (చందానగర్, నమస్తే తెలంగాణ) పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలు దూసుకొస్తున్నాయి. తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం, నగరంలో ఏర్పాటవుతున్న చార్జింగ్ స్టేషన్లతో వినియోగదారులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా వాయుకాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కాలుష్య రహిత వాహనాల తయారీదారులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. ఇందుకోసం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పరిధిలోని నేషనల్ ఆటోమోటివ్ బోర్డు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్) పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టి విద్యుత్ ఆధారిత వాహనాల తయారీకి తోడ్పాటునందిస్తున్నది. ఈ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీతో పాటు తాజాగా జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించింది. దాంతో పాటు ఎలక్ట్రిల్ వెహికిల్‌ను కొనుగోలు చేసేవారికి ఆదాయపన్నులో అదనంగా మరో రూ.1.50 లక్షలకు పన్ను మినహాయింపు సైతం ఇస్తున్నది. ఈ క్రమంలోనే కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తాజాగా నగరంలో సందడి చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల గురించి తెలుసుకుందాం. సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎలక్ట్రిల్ వాహనాలను చార్జింగ్ చేసేందుకు నగరమంతా చార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ-వెహికల్స్‌ను ప్రోత్సహించేదిశగా నూతన పాలసీనీ అందుబాటులోకి తెస్తుండటంతో వివిధ కంపెనీలు క్యూ కడుతున్నాయి. జీహెచ్‌ఎంసీతోపాటు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ వేర్వేరుగా 100 చార్జింగ్ స్టేషన్లకు పైగా ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి ఎక్కువ స్థలం అవసరం లేకపోవడంతో సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్టేషన్లకు ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 50 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సహకారంతో తమ ఆధీనంలోని 50 ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం నడుస్తున్న స్వచ్ఛ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు నిర్ణయించారు. ఇక హైదరాబాద్ మెట్రోరైలు విషయానికి వస్తే లాస్ట్ అండ్ ఫస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రతి స్టేషన్‌లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే బేగంపేట, రాజ్‌భవన్, గచ్చిబౌలి, హైదర్‌నగర్, చికోటి గార్డెన్స్, అత్తాపూర్, ఉప్పల్ సర్వే కాలనీ, మియాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మెట్రోరైలు విషయానికి వస్తే తార్నాక, మెట్టుగూడ, మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ స్టేషన్లలో ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నడుస్తున్న వాహనాల చార్జింగ్‌కు యూనిట్‌కు రూ.6 వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో చార్జింగ్ చేసిన బ్యాటరీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. టీఎస్‌ఆర్టీసీలో కూడా బ్యాటరీ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్, కంటోన్మెంట్ ప్రాంతంలో రీచార్జ్ పాయింట్లున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 1300కి పైగా వాహనాలు తిరుగుతున్నాయి. చార్జింగ్ స్టేషన్లకు జూమ్‌కార్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, ఫార్చూన్ ఇండియా, గటి, గయాం మోటార్ వర్క్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ కంపెనీలు ముందుకొస్తున్నాయి.
More