ఈసీఐఎల్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యకు చెక్!

-కార్యప్రణాళికపై మేయర్ సమీక్ష సిటీబ్యూరో/చర్లపల్లి, నమస్తే తెలంగాణ : ఈసీఐఎల్ కూడలికి కలిసే వివిధ రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తగిన కార్యప్రణాళికను అమలు చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇందులో భాగంగా లాలాపేట్ నుంచి ఈసీఐఎల్ చౌరస్తా, నేరెడ్‌మెట్ నుంచి ఈసీఐఎల్ చౌరస్తా, నాగారం నుంచి ఈసీఐఎల్ చౌరస్తా తదితర మార్గాల్లో అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నళ్లు, యూటర్న్‌లు, ఫుట్‌పాత్‌లు, ఫ్రీలెఫ్ట్‌లు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈసీఐఎల్, నాగారం, నేరేడ్‌మెట్, లాలాపేట్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపట్టాల్సిన కార్యప్రణాళికపై బుధవారం మేయర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుషాయిగూడ, ఈసీఐఎల్ ప్రధాన జంక్షన్‌గా పలు రహదారులను విస్తరించడంతోపాటు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, హెచ్‌ఆర్‌డీసీఎల్, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ, పోలీసు తదితర విభాగాల అధికారులతో త్వరలో ఆ ప్రాంతంలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈసీఐఎల్ చౌరస్తాలోని ప్రస్తుత ట్రాఫిక్ ఐలాండ్‌ను మెరుగుపర్చడంతోపాటు కుషాయిగూడ, చర్లపల్లిలో అధునాతన బస్‌బేలను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఐదు రూపాయల అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా ప్రస్తుతం జవహర్‌నగర్‌కు వెళ్తున్న వ్యర్థాల లారీలను ఎన్‌ఎఫ్‌సీ, కేబుల్ చౌరస్తా మీదుగా జవహర్‌నగర్‌కు మళ్లించాలని ట్రాఫిక్ అధికారులు ప్రతిపాదించగా, పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని మేయర్ భరోసా ఇచ్చారు.
More