బల్దియా బాండ్ల జారీతో వంద కోట్లు సేకరణ

-నెలలో మరో రూ.200 కోట్లకు కసరత్తు -ఎస్‌ఆర్‌డీపీని కొనసాగిస్తాం -మేయర్ బొంతు రామ్మోహన్ -కేంద్రం ప్రోత్సాహకం రూ.13కోట్లు -జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా జీహెచ్‌ఎంసీ విజయవంతంగా మరో రూ.100 కోట్లు సేకరించింది. నిర్ణీత గడువుకన్నా ముందే పెట్టుబడిదారులు ముందుకొచ్చి బిడ్డింగ్ చేయడం విశేషం. అంతేకాదు, వరుసగా మూడోసారి బాండ్లను జారీ చేసి నిధులు సమీకరించిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ రికార్డులకెక్కింది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)అమలు కోసం జీహెచ్‌ఎంసీ మున్సిపల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తున్న విషయం విదితమే. తాజాగా మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 12.30గంటల వరకు బిడ్డింగ్‌కు అవకాశం కల్పించగా, మరో 15 నిముషాల సమయం ఉండగానే, 10.23 శాతం వడ్డీ రేటుకు ఆరు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొని రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఎస్‌పీఏ సెక్యూరిటీస్, ఏకే క్యాపిటల్స్ చెరి రూ.పది కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టగా, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్, ఎస్‌బీఐ ట్రస్ట్ సహా ఎస్‌బీఐకి చెందిన మరో మూడు సంస్థలు కలిపి మిగిలిన రూ.80 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. అయితే బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ సేకరించిన రూ.100 కోట్లకు గాను కేంద్రం ప్రోత్సాహకంగా రూ.13 కోట్లు జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తుంది. దీంతో వడ్డీరేటు రూ.8.9శాతానికి తగ్గు తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటిలోకి ఏఏ-రేటింగ్ పొందిన మొదటి సంస్థగా జీహెచ్‌ఎంసీ ఖ్యాతి గడించినట్లు వారు చెప్పారు. ఇప్పటి వరకు ఏఏఏ-రేటింగ్ ఉన్న సంస్థలు మాత్రమే బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించినట్లు వారు వివరించారు. రూ.305 కోట్లు సమీకరించాలని మొదట భావించినప్పటికీ స్టాక్ మార్కెట్‌లో ఏర్పడ్డ ఒడిదుడుకుల నేపథ్యంలో ప్రస్తుతానికి రూ.100 కోట్లతో సరిపెట్టుకోవాలని, మార్కెట్ అనుకూలంగా ఉంటే వచ్చే నెల రోజుల్లో మరో రూ.200 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఎస్‌ఆర్‌డీపీ కోసం రూ. 1000 కోట్లు సేకరించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే రెండు విడుతల్లో రూ. 395 కోట్లు, తాజాగా మంగళవారం రూ.100 కోట్లు సేకరించారు. కేంద్రం ప్రోత్సాహకం రూ.13 కోట్లు : కమిషనర్ దానకిశోర్ కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ నిధుల సమీకరణలో స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా కేంద్ర ప్రభు త్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగం గా మంగళవారం బాండ్ల ద్వారా సేకరించిన రూ.100కోట్లకుగాను కేంద్రం ప్రోత్సాహక బహుమతిగా రూ.13కోట్లు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. నిధుల సమీకరణకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించినట్లు పేర్కొన్నారు. బాండ్ల జారీకి ఎస్‌బీఐ కార్ప్స్ సంస్థ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల్లోనే మరో రూ.200కోట్లు సేకరిస్తామని కమిషనర్ వివరించారు.
More