చేయి తగిలిందనే.. చంపేశాడు

ఖైరతాబాద్ : రోడ్డుపై వెళ్తుంటే చేయి తగిలిందని... పడుకున్న వ్యక్తిని సిమెంట్ దిమ్మెతో మోది, కత్తితో పొడిచి హత్య చేశాడు. మెట్రో స్టేషన్ వద్ద డివైడర్‌పై జరిగిన హత్య మిస్టరీని సైఫాబాద్ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఖైరతాబాద్, మహాభారత్‌నగర్‌కు చెందిన నునావత్ బంగారి (56) కూలీ. ఈ నెల 17న ఖైరతాబాద్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా... రోడ్డుపై నిలబడి ఉన్న బోరబండకు చెందిన ప్రకాశ్‌రాజ్ అలియాస్ డాలర్ పింటూ (19)కు చేయి తగిలింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బంగారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9గంటల ప్రాం తంలో బంగారి, అతని భార్య చాంధీకి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో అతను బయటకు వెళ్లిపోయాడు. భార్య సైతం దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో బంగారి ఖైరతాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా...అక్కడే ఓ పాన్‌షాప్‌లో సిగరేట్ తాగుతున్న ప్రకాశ్ రాజ్ కంట పడ్డాడు. బంగారి మెట్రోస్టేషన్ సమీపంలోని పిల్లర్ నెం. 1175-1176 మధ్యలో డివైడర్‌పై పడుకున్నాడు. గమనించిన ప్రకాశ్‌రాజ్ అక్కడి నుంచి బోరబండలోని ఇంటికి వెళ్లి మ ద్యం తాగాడు. కూరగాయల కత్తిని జేబులో పెట్టుకొని అర్ధరాత్రి 1.30గంటల ప్రాంతంలో తిరిగి ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బంగారి గాఢ నిద్రలో ఉన్నాడు. అక్కడే ఉన్న సిమెంట్ దిమ్మె తీసుకొని బంగారి ఎడమ చెవిపై భాగంలో మోదా డు. సుమారు మూడుసార్లు మోదడంతో తలపగిలింది. తీవ్ర రస్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగానే కత్తితో చాతిలోపొడిచి అక్కడి నుంచి బోరబండకు వెళ్లిపోయాడు. 48 గంటల్లో ఛేదించిన పోలీసులు ఈ నెల 18న ఉదయం 6.30గంటల ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న బంగారిని జీహెచ్‌ఎంసీ కార్మికులు గుర్తించి సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. కేసును ఛేదించడానికి ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐ సైదిరెడ్డి నేతృత్వంలో డీఐ నర్సింహులు, ఎస్సైలు సైదిరెడ్డి, ప్రసాద్, రవి, దయాకర్, సైదా, బాలరాజులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఏడుగుళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలో అస్పష్టంగా బంగారి తలపై ఓ వ్యక్తి సిమెంటు దిమ్మెతో మోదుతున్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తి దుస్తులను గుర్తించిన పోలీసులు నిందితుడి ఆచూకీని తెలుసుకునేందుకు ఖైరతాబాద్‌ను జల్లెడ పట్టారు. స్థానికంగా ఓ దేవస్థానంలో సీసీ ఫుటేజీలను పరిశీలించగా అదే దుస్తులు ధరించిన వ్యక్తి కనిపించాడు. అతని కోసం స్థానికంగా ఆరా తీయగా... గతం లో ఓ ప్యాకర్స్ సంస్థలో హెల్పర్‌గా పనిచేసి జులాయిగా తిరుగుతున్న ప్రకాశ్ రాజ్‌గా గుర్తించారు. అతను బోరబండలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడిపై హత్య, కుట్ర కేసులను నమోదు చేశారు. ఈ సమావేశంలో ప్రవీణ్ కుమార్, తుల్జా, మహేందర్, జానీ బాషా, శ్యామ్ కిశోర్ పాల్గొన్నారు.
More