బహిరంగ చర్చకు సిద్ధం

- సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శిస్తే జీరో అవుతావు.. - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మండిపడ్డఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పెద్దఅంబర్‌పేట : గ్రామాల్లో వార్డు సభ్యులుగా ఓడిన వారు వ్యవహరించినట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు నియోజకవర్గంలో ఉన్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాజీ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ వేసిన శిలాఫలకాన్ని చూపిస్తూ మాట్లాడిన మాటలను ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం పెద్దఅంబర్‌పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి కాని...చేస్తున్న పనులకు అడ్డుపడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరన్నారు. ఎంపీ వాస్తవాలు తెలియకుండా తనపై మూడు సార్లు ఓడిన వ్యక్తి మాటలు వింటున్నారని, వారి మాటలు వింటే మీ పని కూడా అదే విధంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ను, కేటీఆర్‌ని తిడితే హీరో కాలేవని, జీరో అవుతావన్నారు. తాను చేసిన అభివృద్ధిపై నియోజకవర్గంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. పెద్దఅంబర్‌పేట నుంచి తట్టిఅన్నారం రేడియల్ రోడ్డు పనులపై ఎన్నికల ముందు హంగామా చేశారని ఎంపీ ఆరోపించారని, అందుకు ధీటుగా జీవో కాపీని చూపిస్తున్నామని వివరించారు. గత ఏడాది డిసెంబర్ 8న జీవో వచ్చిందని, బలిజగూడ, కవాడుపల్లి రోడ్డు పనులు చేయాల్సి ఉందని, అప్పుడు ఎన్నికలకోడ్‌లో భాగంగా పనులు జరగలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నియోజకవర్గానికి దాదాపు రూ.50 కోట్లు కేటాయించి ప్రజలందరికీ నీరందించారని, రూ.66 కోట్లతో లాజిస్టిక్‌పార్కును ఆయన ప్రోత్సాహంతో ఏర్పాటు చేశానని వివరించారు. కేటీఆర్ వేసిన శిలాఫలకాన్ని ముట్టుకుని ఎంపీ, కాంగ్రెస్ నాయకులు అపవిత్రం చేశారని టీఆర్‌ఎస్ నాయకులు పాలతో శుద్ధి చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సిద్దంకి కృష్ణారెడ్డి, కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, ఈ.బలరాం, హరిశంకర్, గౌని భాస్కర్‌గౌడ్, గోవర్ధన్‌గౌడ్, వెంకటేశ్వరరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, రాము, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నగేశ్, జగన్, సంజీవ, రాజు, సుధాకర్, ముఖేశ్, హరి, వివిధ కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
More