సిటీ ప్రశాంతంగా ఉంటే..బీజేపీకి నచ్చదా..?

-నగరంలో కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి రాలేదు -మతాలు, కూలాల మధ్య చిచ్చు పెట్టాలని చూడొద్దు -బీజేపీపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ -బంగారు తెలంగాణ, విశ్వనగరమే లక్ష్యమన్న యువనేత -కూకట్‌పల్లిలో నియోజకవర్గ డివిజన్, బూత్ స్థాయి టీఆర్‌ఎస్ కమిటీ సభ్యుల సమావేశం కూకట్‌పల్లి, ఆగస్టు19(నమస్తే తెలంగాణ) : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్‌ను మూడేండ్ల కాలంలో నిర్మించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గలోని ఎన్ గార్డెన్స్‌లో సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్‌తో పాటు కార్మిక శాఖ మంత్రి సీహెచ్.మల్లారెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని, పచ్చబడుతున్న పంట పొలాలు, రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై, సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్ నూతనంగా ఎన్నుకున్న కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కూన వెంకటేశ్‌గౌడ్, కార్పొరేటర్‌లు జూపల్లి సత్యనారాయణ, సబీహా బేగం, తూము శ్రావణ్ కుమార్, పండాల సతీశ్‌గౌడ్, కాండూరి నరేంద్ర చార్యా, మందాడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహ యాదవ్, తరుణి నాయి, దొడ్ల వెంకటేశ్‌గౌడ్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎండీ.గౌసుద్దిన్, నరేందర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు మధవరం రంగారావు, పగడాల బాబురావు తదితరులు పాల్గొన్నారు. మినీ ఇండియాగా కూకట్‌పల్లికి మరో పేరుందని, ఇక్కడ దేశంలోని వివిధ రాష్ర్టాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు నివాసముంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ వస్తే రాష్ట్రంలో నివాసముంటున్న ఇతర రాష్ర్టాల ప్రజలపై దాడులు పెరుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఈ ప్రాంతంలో అన్ని రాష్ర్టాలు, ప్రాంతాల ప్రజలు సోదర భావంతో జీవిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం కాపీ కొడుతుందని గుర్తు చేశారు. అదే విధంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చొరవ తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, అనేక పరిశ్రమలకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని తెలియజేశారని చెప్పారు. ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులకే స్పందించి అనేక మందికి కావలసిన సేవలను అందించిన నాయకుడు కేటీఆర్ అని తెలిపారు. రాబోయే 20 ఏండ్ల వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అన్నారు. సైన్యం వంటి కార్యకర్తలున్న టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టలేక బీజేపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని, 50 లక్షల మందితో భారీ సభ్యత్వ నమోదు సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని, బీజేపీది మిస్డ్ కాల్ మెంబర్‌షిప్ పార్టీ అని ఎద్దేవ చేశారు. కేసీఆర్ షహిన్‌షాలా ఫీల్ అవుతూ పాలనను కొనసాగిస్తున్నారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డ ఆరోపించాడని, తెలంగాణ ప్రజల మనస్సులలో కొలువైన షహీన్ షా కేసీఆరేనని అన్నారు. అధికారంలో ఉన్న వారు హుందాగా మాట్లాడాల్సింది పోయి తప్పుడు ఆరోపణాలు చేసి తమ దిగజారుడు తనాన్ని చూపించుకున్నారని విమర్శించారు. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్నారు.
More