జలమండలికి జాతీయ స్థాయిలో ప్రశంసలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓడీఎఫ్ ఫ్లస్, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ నీటి నిర్వహణ వంటి విషయాల్లో ఇతర మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కార్యదర్శి దుర్గా శంకర్ ముష్రా కొనియాడారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ ఎం. దానకిశోర్‌ను ఆయన ప్రశంసించారు. అదనంగా అయిదు పార్కులు నిర్మించడం పట్ల అభినందించారు. కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ, సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో స్థిరమైన పారిశుధ్యం అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. దేశంలోని వివిధ వాటర్ బోర్డు ప్రతినిధులు పాల్గొనగా, ఇందులో హైదరాబాద్ జలమండలి పారిశుధ్య నిర్వహణ, ఎస్టీపీల ద్వారా మురుగునీరు శుద్ధి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్కు, వాక్ కార్యక్రమాలపై ఈ సెమినార్‌లో మూడు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి హార్విందర్ సింగ్ పూరి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కార్యదర్శి దుర్గా శంకర్ ముష్రా ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా, స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ వీకే జిందాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెమినార్‌లో జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ పారిశుధ్యంలో జలమండలి తీసుకువచ్చిన సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వర్క్‌షాపులో వివరించారు. స్వయం సహాయక బృందాలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు మొత్తం 6, 300 మంది వలంటీర్లు నీటి సంరక్షణలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎండీ తెలియజేశారు. దీంతో పాటు ఆనంతరం ఘన వ్యర్థాలు, ఇప్పటికే ఉన్న ఎస్టీపీల్లో మల వ్యర్థాల శుద్ధి నిర్వహణపై జలమండలి ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సెమినార్‌లో ఆపరేషన్స్-1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More