హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి

హైదర్‌నగర్ /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ సోమవారం వెస్ట్‌జోన్ పరిధిలో పర్యటించారు. హైటెక్ సిటీ, నిజాంపేట-బాచుపల్లి మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా అధికారులతో కలిసి పర్యటించారు. నిజాంపేటలో దాదాపు 2.5 లక్షల మంది జనాభాలో అత్యధిక శాతం ఐటీ ఉద్యోగులే ఉన్నారని, నిజాంపేట, బాచుపల్లి, హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అధికారులు అరవింద్‌కుమార్‌కు వివరించారు. ప్రస్తుతం 60 ఫీట్లతో ఉన్న నిజాంపేట-బాచుపల్లి రహదారి విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని హెచ్‌ఆర్‌డీసీఎల్, ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జేఎన్‌టీయూ-హైటెక్‌సిటీ మార్గంలో మియాపూర్ మెట్రో డిపో నుంచి కల్వరీ టెంపుల్, వసంత్ విహార్ మీదుగా ఆర్వోబీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలించాలని సూచించారు. ఈ రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ హరిచందన, సీఈలు మోహన్ నాయక్, జియావుద్దీన్ తదితరులు ఉన్నారు.
More