అణచివేతకు గురిచేస్తున్నారు..

బషీర్‌బాగ్, జూలై 21: దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుందని మితవాద శక్తులను ఎదుర్కోవడానికి విప్లవకారులు, కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని ప్రముఖ విప్లవకవి నిఖిలేశ్వర్ అన్నారు. దేశాన్ని సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు అణచివేతకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం ఆధ్వర్యంలో భారత విప్లవోద్యమ రథసారదులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వర్లు, తరిమెల నాగిరెడ్డి ల సంస్మరణ సభ ఎస్. నర్సింహా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్లవకవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కామ్రేడ్ వెంకటేశ్వర్లు, నాగిరెడ్డిలు గురుతరమైన బాధ్యతలను నిర్వహించారన్నారు. నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రతినిధి డాక్టర్ జతిన్ కుమార్ మాట్లాడుతూ పాలకుల అవసరాల మేరకు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో యూసీసీఆర్‌ఐ-ఎంఎల్ ప్రతినిధి డాక్టర్ సీహెచ్‌ఎన్ మూర్తి, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయేందర్ రావు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.
More