సింహవాహిని..మహంకాళి

-బోనాలకు రూ. 25కోట్లు మంజూరు -లాల్‌దర్వాజ బోనాలను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్, నగర కొత్వాల్ -సికింద్రాబాద్ ఉజ్జయినీ ఆలయ పనులను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బేగంపేట : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం మంత్రి, జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీస్‌లతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి ఆలయం వద్ద జాతర పనుల ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వద్ద జరుగుతున్న పనులు వివిధ శాఖల అధికారులను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. డీఎంహెచ్‌వో ప్రైవేట్ దవాఖాన సంయుక్త ఆధ్వర్యంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వం తరపున ఆదివారం ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తామని తెలిపారు. బోనాలు సమర్పించే మహిళలకు ఈ సారి రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.కార్యక్రమంలో సికింద్రాబాద్ ఉత్తర మండలం జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ, జలమండలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్న మాజీ ఎంపీ కవిత 21న ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ కవిత మట్టికుండతో తయారు చేసిన బోనంను సమర్పించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ బోనంతో పాటు 1008 బోనాలను సమర్పించనున్నారని, సికింద్రాబాద్ ఆదయ్య నగర్ కమాన్ నుంచి మహంకాళి ఆలయానికి బోనం ఊరేగింపు, కళాకారులు, డప్పు వాయిద్యాలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించనున్నారని పేర్కొన్నారు. మారేడ్‌పల్లి : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ముదిరాజ్ బోనాల వెల్ఫేర్ అసోసియేషన్, సురిటి అప్పయ్య ముదిరాజ్ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సామూహిక బోనాలను సమర్పించడానికి ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మోండా డివిజన్ కార్పొరేటర్ ఆకుల రూప శుక్రవారం ప్రారంభించారు.సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్‌లోని నాగదేవత ఆలయం నుంచి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మహిళలు బోనంతో ర్యాలీగా వెళ్లారు.కార్యక్రమంలో ముదిరాజ్ బోనాల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు లింగాల పుష్పలత, నాయకులు పిట్ల నాగేశ్, ప్రభాకర్, గౌరీశంకర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. లాల్‌దర్వాజలో అట్టహాసంగా బోనాలు పాతనగరంలోని శక్తి స్వరూపిణి లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర 111వ వార్షికోత్సవ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ శాఖ కేటాయించిన క్రేన్‌లో అమ్మవారి ఆలయ శిఖరం వరకు చేరుకున్న వారు ముందుగా భక్తి ప్రపత్తులతో శిఖరపూజ చేశారు. ధ్వజారోహణ పూజలను నిర్వహించి శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ. నగర పోలీస్‌శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ప్రశాంతంగా బోనాల పండుగ నిర్వహించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారని తెలిపారు. పండుగ సందర్భంగా అవసరమైన చోట ట్రాఫిక్‌ను దారిమల్లించడం, ప్రధాన చౌరస్తాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ మాట్లాడుతూ.. ఆలయాల వద్ద అభివృద్ధి పనులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో పాటు హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, టాస్క్‌పోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్, ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్ ఎంఏ రషీద్, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింగ్‌రావు సలహాదారులు , ప్రతినిధులు పాల్గొన్నారు.
More