25లోగా వృద్ధాప్య పింఛన్ల అర్హుల జాబితా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వృద్ధాప్య పింఛన్ల వయసును ప్రభుత్వం 64 నుంచి 57 ఏండ్లకు కుదించిన నేపథ్యంలో దీని ప్రకారం పింఛన్‌కు అర్హులైన వారిని వారం రోజుల్లోగా గుర్తించి ఈనెల 25వ తేదీలోగా జాబితా రూపొందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది నవంబర్‌లో ప్రచురించిన ఓటర్ల తుది జాబితాను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయన కోరారు. రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండి, ఏ విధమైన స్థిరాస్తి లేనివారు, గతంలో పింఛన్ పొందనివారి పేర్లను ఈ జాబితాలో పొందుపర్చాలని సూచించారు. పింఛన్ లబ్ధిదారుల గుర్తింపు, స్వచ్ఛ హైదరాబాద్, ఆస్తిపన్నులో వ్యత్యాసాల నివారణ తదితర అంశాలపై శుక్రవారం కమిషనర్ బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక కోసం బీఎల్‌ఓల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టాలని, ఈ సందర్భంగా అర్హులైన వారి ఆధార్ నంబర్లు సేకరించాలని కోరారు. 57 ఏండ్ల వయసు నిండినవారి ఎంపిక పూర్తయ్యాక వారు మరేదైనా పింఛన్ పొందుతున్నారా అనేది తెలుసుకునేందుకు ఆ జాబితాను సకుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. దీనికోసం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పన్ను మూల్యాంకానికి ప్రత్యేక డ్రైవ్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1000 గజాల స్థలంకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న హోటళ్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు, ప్రైవేటు స్కూళ్లు తదితర వాణిజ్య భవనాలు చాలా వరకు నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అధిక నిర్మాణాలు చేసినట్లు పేర్కొంటూ, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంతోపాటు ఆస్తిపన్ను పునర్ మూల్యాంకానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. దీనికోసం జోన్లవారీగా అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక జోన్‌కు చెందిన అధికారులు మరోజోన్‌కు వెళ్లితనిఖీలు చేస్తారని, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉండే సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలను పర్యవేక్షిస్తుందన్నారు. ఆస్తి పన్నుల్లో ఒకేవిధమైన భవనాలకు మధ్య భారీ వ్యత్యాసాలున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు, దీన్ని దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిర్వహించాలని నిశ్చయించామన్నారు. అనుమతులు పొందిన దానికన్నా నిర్మాణాల్లో భారీస్థాయి వ్యత్యాసాలుంటే, ఆస్తిపన్నులో సైతం అసాధారణ తేడాలుంటే బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు. తనిఖీలు వివాదాలకు తావులేకుండా సాగాలని కమిషనర్ స్పష్టం చేశారు.
More