కాలం చెల్లిన బస్సులు ఇక తుక్కుకే..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గుప్ గుప్ మంటూ పొగ వెదజల్లుతూ కొద్దిపాటి ఎత్తులు పల్లాలు కూడా ఎక్కలేక పోవడం, నడుస్తూ అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ అయ్యే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగిపోతున్నది. ఇటువంటి వాటిని స్క్రాప్‌కు తరలించేందుకు టీఎస్‌ఆర్టీసీ నడుం బిగించింది. నగరంలో చాలా ఆర్టీసీ బస్సులు పరిశ్రమల మాదిరిగా పొగ వదులుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సుమారు 3,750 బస్సులు నగరంలో ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఇందులో దాదాపు సగం 12 నుంచి 15 ఏండ్లు దాటిన బస్సులు ఉన్నాయి. 130 బస్సులు 15 ఏండ్లు దాటినవి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ బస్సులు ప్రయాణికుల లోడ్ తట్టుకోలేకపోతున్నాయి. హెవీ ట్రాఫిక్‌లో నడువలేక చతికిల పడిపోతూ ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రోడ్డు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తుండటంతో ఫిట్‌నెస్‌లేని గ్రేటర్ ఆర్టీసీ బస్సులను పక్కకు పెట్టాలని నిర్ణయించారు. గత నెలలో రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన రివ్యూలో ఈ విషయంపై చర్చించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, కాలం చెల్లిన బస్సుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అంతేగాకుండా హైదరాబాద్ జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్‌లో అన్ని శాఖలతో కూడిన సమన్వయ సమావేశంలో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల బ్రేక్‌డౌన్స్‌తో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయని, వీటిని నివారించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించారు. వీటితోపాటు కాలం చెల్లిన బస్సులతో ఇంధనం కూడా ఎక్కువ ఖర్చవుతున్నది. బస్సుల నిర్వహణ భారం కూడా పెరిగిపోతున్నది. వీటిని పక్కకు పెట్టి వీటి స్థానంలో కొత్త బస్సులు తేవాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ నిధుల లేమీ కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా చేస్తున్నది. అయితే మెట్రోరైలు మార్గాలున్న ప్రాంతాల్లో ప్రయాణికుల నిష్పత్తి తక్కువగా ఉండటంతో ఈ మార్గాల్లో నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటున్నది. వీటిని పాత బస్సులు నడుస్తున్న స్థానాల్లో రీప్లేస్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నది.
More