గవర్నర్‌తో సీఎం భేటీ బడ్జెట్ సమావేశాలపై చర్చ

KCR హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శాసనసభలో బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఇద్దరు దాదాపు గంటపాటు చర్చించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరును సీఎం గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ సభ్యులు దురుద్దేశపూర్వకంగానే రభస సృష్టించారని, విచక్షణ మరిచి వ్యవహరించారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. సభా సంప్రదాయాలను విస్మరించి మితిమీరి వ్యవహరించినందుకే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరుతెన్నులపై గవర్నర్‌కు విశ్లేషించి చెప్పినట్లు తెలిసింది. రైతులకు పంటలు లాభసాటిగా మార్చడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈసారి బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు.
× RELATED మాది రైతు ప్రభుత్వం