సుప్రీంకోర్టు మనదే.. రామమందిరం నిర్మిస్తాం

యూపీ బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రమంత్రి ముకుట్ బిహారి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణం, సుప్రీంకోర్టుపై వివాదాస్పదంగా మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు మనదే. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం అని వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణంపై బీజేపీ ఇచ్చిన హామీ గురించి ఆదివారం మీడియా ప్రశ్నించగా.. మందిర నిర్మాణం, అభివృద్ధి అంశాలతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ మందిర నిర్మాణం అనేది మా లక్ష్యం. దాన్ని నిర్మించి తీరుతాం అని ముకుట్ పేర్కొన్నారు. అయితే, మందిర నిర్మాణ అంశం న్యాయస్థానంలో ఉందికదా అని విలేకర్లు ప్రశ్నించగా, మంత్రి స్పందిస్తూ..మందిర నిర్మాణ అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఏంటి? సుప్రీంకోర్టు కూడా మనదే కదా. సుప్రీంకోర్టు మనదే. అధికారులు మనవాళ్లే. పాలకులు మనవాళ్లే. దేశం మనదే. ఆలయం కూడా మనదే అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ పక్కనే కూర్చున్న మరోమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య స్పందించేందుకు నిరాకరించారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న ముకుట్ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నంచేశారు. సుప్రీంకోర్టు కూడా మనదే అంటే.. దేశంలో భాగమే అని అర్థం. దేశం మనదైతే అందులోని అన్నీ మనవేగా. ఏదిఏమైనా అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం అని వివరించారు.

Related Stories: